తాస్జాగా కమళం గూటినుంచి బయటకు వచ్చి సైకిల్ ఎక్కేసిన మాజీమంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గురించి ఆసక్తికరమైన చర్చ.. ఆన్ లైన్ వేదికగా జరుగుతుంది. అందుకు కారణం బాబు తీసుకున్న నిర్ణయం కాగా… ఆ నిర్ణయంలో కన్నా ఫ్యాన్స్ ను బయపెడుతున్న న్యూమరాలజీ లెక్కలు!!
అవును… తాను ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన పెదకూరపాడు నియోజకవర్గం సీటు ఇస్తే.. ఆడుతూ పాడుతూ గెలిచేయొచ్చని కన్నా కలలుగన్నారట. అలాకాని పక్షంలో.. ఒకసారి గెలిచిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చినా.. కాస్త కష్టపడి గెలిచేయొచ్చు అనుకున్నారట కన్నా! కానీ.. టీడీపీకి ఏమాత్రం కలిసి రాని.. కష్టమైన సత్తెనపల్లి సీటును ఫైనల్ చేయబోతున్నారంట బాబు! దీంతో… చరిత్ర తవ్వుతున్నారు ఫ్యాన్స్!
ఒకసారి చరిత్ర చూస్తే… గుంటూరు జిల్లాలో టీడీపీకి ఒక విధంగా కొరుకుడు పడని స్థానం ఉందంటే… అది సత్తెనపల్లి సీటే! 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తొలి విజయం సత్తెనపల్లి నుంచి దక్కిన సంగతి తెలిసిందే. ఆనాడు నన్నపనేని రాజకుమారి ఈ స్థానం నుంచి గెలిచారు. తరువాత మళ్ళీ 16ఏళ్లకు.. అంటే.. 1999లో యలమంచిలి వీరాంజనేయులు తెలుగుదేశం తరఫున గెలిచారు. ఆ తరువాత మళ్ళీ 15ఏళ్లకు.. అంటే.. 2014లో కోడెల శివప్రసాద్ గెలిచారు. ఈ లెక్కన లెక్కేసుకుంటే… టీడీపీ పుట్టిన తర్వాత జరిగిన తొమ్మిది ఎన్నికల్లో.. కేవలం మూడంటే మూడుసార్లే ఆ పార్టీ సత్తెనపల్లిలో గెలిచిందన్న మాట!
సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే… సత్తెనపల్లిలో పార్టీ రెండోసారి గెలవడానికి తీసుకున్న సమయం 16 సంవత్సరాలు కాగా… మూడో గెలుపు దక్కడానికి పట్టిన సమయం పదిహేనేళ్లు. ఈ లెక్కన చూసుకుంటే… 2014 నుంచి లెక్కేస్తే.. మరో పద్నాలుగేళ్లు ఆగితే టీడీపీ నాలుగోసారి గెలుస్తుందన్నమాట! అంటే… 2027 వరకూ కన్నా లక్ష్మీనారాయణ వేచి చూడాలన్నమాట! ఇది కన్నా ఫ్యాన్స్ వేసుకుంటున్న న్యూమరాలజీ లెక్కలు!
దీంతో.. పదేళ్లు చట్టసభలకు దూరంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు.. బాబు ఇలాంటి అగ్ని పరీక్ష పెట్టడం భావ్యం కాదని అంటున్నారు ఆయన అభిమానులు. తమను నమ్మి పార్టీలోకి వస్తే.. ఇలాంటి రిస్క్ పనులు చేయించడం కరెక్ట్ కాదని వాపోతున్నారంట! బాబుకు కన్నాపై గత కాలం తాలూకు కక్షలు ఏమీ లేకపోతే… ఇలాంటి “సత్తెనపల్లి” పనులు ఎందుకు చేయిస్తారంటూ ఆన్ లైన్ వేదికగా కామెంట్లు పెడుతున్నారంట!