Vijayasai Reddy: రాజకీయాల్లో ఎవరెప్పుడు ఎలా మెలుగుతారో చెప్పడం కష్టం. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన గతానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన ఒక సహాయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోడెల ఒకప్పుడు తనను గట్టెక్కించినప్పటికీ, ఆయన ఆపదలో ఉన్నప్పుడు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని, ఆయనపై విమర్శలు చేయడమంటే ఏమిటని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
2016లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి దక్కిన ఏకైక సీటుకు జగన్, సాయిరెడ్డిని ఎంపిక చేశారు. అయితే నామినేషన్ ప్రక్రియలో, సాయిరెడ్డి కొన్ని తప్పిదాలు చేసిన కారణంగా, ఎన్నికల అధికారికి దాన్ని తిరస్కరించే ఆలోచన వచ్చిందట. ఇదే సమయంలో, తన రాజకీయ భవిష్యత్తు తేలిపోయినట్లే అని భావించిన సాయిరెడ్డి, తక్షణమే కోడెల వద్దకు వెళ్లి సహాయం కోరారట. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం కోడెల నైజం. అందుకే, రిటర్నింగ్ అధికారిని ఒప్పించి, సాయిరెడ్డికి మరో అవకాశం కల్పించారని చెబుతున్నారు.

ఈ ఒక్క అవకాశం కారణంగా, సాయిరెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టి, వైసీపీ పార్లమెంటరీ నేతగా ఎదిగి, కేంద్రంతో సంబంధాలను బలపరచుకున్నారు. ప్రధాని మోదీ దృష్టిలో పడి, తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. కానీ, 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే, పరిస్థితులు మారిపోయాయి. కోడెలపై రాజకీయ కక్షసాధింపులు ప్రారంభమైనప్పుడు, ఆపదలో ఆదుకున్న వ్యక్తిని సాయిరెడ్డి కనీసం ఫోన్‌లో పలకరించలేదట. కోడెలతో మాట్లాడమని సన్నిహితులు సలహా ఇచ్చినప్పటికీ, ఆయన సూచనను పట్టించుకోలేదని చెబుతున్నారు.
కేవలం ఫోన్ ఎత్తకుండా ఉండటం మాత్రమే కాదు, ఆ తర్వాత కోడెలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. రాజకీయ విభేదాలు ఒకవైపు, కానీ వ్యక్తిగతంగా చేసిన సహాయాన్ని మరిచిపోవడం ఏ మేరకు న్యాయం? అంటూ టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు తనను ఆపద నుంచి బయటపడేసిన కోడెలను, వైసీపీ అధికారంలోకి రాగానే ఎదురుదాడికి గురి చేయడమేంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా ఎదురైనా, మానవత్వం మాత్రం మరిచిపోవడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

