ఈమధ్యనే వైసిపిని వదిలేసిన జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికిసొంత బంధువులే పెద్ద షాక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని జగన్ నియమించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఆనంను సమన్వయకర్తగా నియమించారంటేనే వచ్చే ఎన్నికల్లో దాదాపు టిక్కెట్టు ఆనంకే అన్న విషయం అర్ధమైపోతోంది.
ఆనం విషయంలో క్లారిటీ రాగానే ఆగ్రహంతో బొమ్మిరెడ్డి వెంటనే వైసిపికి గుడ్ బై చెప్పేశారు. ఎందుకంటే, దాదాపు నాలుగేళ్ళ వరకూ వెంకటగిరి బాధ్యతలు బొమ్మిరెడ్డే చూశారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ కూడా కావటంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టును ఆశించటంలో తప్పూ లేదు. కానీ సమస్య అంతా ఇక్కడే వచ్చింది. తనను కాదని ఆనంకు సమన్వయకర్తగా నియమించటాన్ని బొమ్మిరెడ్డి తట్టుకోలేకపోయారు. నోటికొచ్చినట్లు జగన్ పై మండిపడి వైసిపికి రాజీనామా చేశారు.
సరే, ప్రస్తుత విషయాని వస్తే రెండు రోజులుగా నియోజకవర్గంలోని పార్టీ నేతలు, తన మద్దతుదారులను ఆనం వరుసగా కలుస్తున్నారు. గ్రామస్ధాయి నుండి మండల, నియోజకవర్గ కేంద్రంలోని నేతల వరకూ అందరితోను ఆనం భేటీ అవుతున్నారు. విచిత్రమేమిటంటే, ఆనం సమావేశమవుతున్న వారిలో బొమ్మిరెడ్డి దగ్గర బంధువులు కూడా ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలోని సైదాపురం, వెంకటగిరి, రాపూరు, కలువాయి, డక్కిలి, బాలయపల్లి మండలాల్లోని బొమ్మిరెడ్డి బంధువులు కూడా ఆనంకే మద్దతుగా నిలబడటం గమనార్హం. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమిటంటే ? ఏదో జగన్ దయ వల్ల జిల్లా పరిషత్ ఛైర్మన్ అయిపోయిన బొమ్మిరెడ్డి తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్న విషయం అర్దమైపోతోంది. అందుకే తన బంధువులు కూడా ఆనంకే మద్దతుగా నిలవటంతో పెద్ద షాకే తిన్నారు.