ఈ నెల 13న ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టం!

ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈలోపులోనే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా నెల్లూరు కేంద్రంగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరగబోతుందని తెలుస్తుంది. వైసీపీ కంచుకోటలో ఆ పార్టీని దెబ్బ తీయటానికి టీడీపీ వరుస వ్యూహాలు అమలు చేస్తోందని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేది హాట్ టాపిక్ గా మారింది.

ఈమధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారని ఆరోపిస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు వీరంతా టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారని సమాచారం. ఇందుకోసం ఈ నెల 13ని ముహూర్తంగా పెట్టుకున్నారని అంటున్నారు. కారణం… లోకేష్ యువగళం పాదయాత్ర ఆ రోజునే నెల్లూరులోకి ఎంటరవ్వనుంది. దీంతో… ఇంతకుమించి మంచి ముహూర్తం ఉండదని ఈ ముగ్గురు నేతలూ భావిస్తున్నారంట.

అవును… ఈ నెల 13న నెల్లూరులోకి ఎంటరవుతున్న లోకేష్ పాదయాత్రలో పాల్గొని, ఆ యాత్రకు తమ సంఘీబావాన్ని ప్రకటించనున్నారంట ఈ ముగ్గురు నేతలు. అనంతరం అధికారికంగా టీడీపీలో చేరిపోతారని తెలుస్తుంది. నెల్లూరులో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా… ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు.

మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు.. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇక మేకపాటి చంద్రశేఖర రెడ్డి నేరుగా లోకేష్ ను కలిసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ ముగ్గురు తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరటం ద్వారా ఎన్నికల సమయానికి నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ కు దగ్గరవ్వటంతో పాటుగా.. పార్టీ అభ్యర్ధులుగా పని చేసుకోవటానికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారట.

అయితే నిజంగానే వీరు తమ తమ ఎమ్మెల్యే పదవులకు రాజినామాలు చేయగలుగుతారా.. అందుకు చంద్రబాబు అనుమతి ఇస్తారా.. అనేది వేచి చూడాలి. ఎందుకంటే గతంలో వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్న చారిత్రక తప్పిదం సమయంలో కూడా బాబు నోట రాజినామాల మాట రాలేదు. నిస్సిగ్గుగా నాడు చేసిన పనిని సమర్ధించుకున్నారు కూడా! ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఫాలో అవుతారని అంటున్నారు. మరి ఈ నెల 13న నెల్లూరు కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనేది వేచి చూడాలి!