మనస్సు చచ్చిపోయిందని కేతంరెడ్డి… జనసేనకు రాజీనామా!

అమావాస్య రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా టీడీపీతో పొత్తు ప్రకటించారని, అంతకంటే గొప్ప ముహూర్తం పవన్ కు దొరకలేదేమో అని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే… టీడీపీతో పొత్తు అనంతరం పరిణామాలు నాలుగో విడత వారాహి యాత్రలో కనిపించాయని కథనాలొస్తున్న తరుణంలో… వరుసగా రాజీనామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఏదైనా సినిమా కథను ఓకే చేయాలంటే… ఎవరైనా ప్రొడ్యూసర్ తో సినిమాకు కమిట్ అవ్వాలంటే… మరెవరైనా డైరెక్టర్ కు డేట్స్ ఇవ్వాలంటే అది కేవలం పవన్ ఒక్కరు మాత్రం నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ఇక చిన్న చిన్న సర్ధుబాట్లు, బేరసారాల మధ్యవర్తిత్వాలు వంటివి మేనేజర్ లాంటి వాళ్లు చూసుకుంటారు. అయితే ఇది రాజకీయం.. ఒక పార్టీ.. కొన్ని వందల మంది నాయకులు, లక్షల మంది కార్యకర్తలు.. ఇది ఒక వ్యవస్థ!

ఈ విషయం మరిచారో ఏమో… టీడీపీతో పొత్తు పవన్ కల్యాణ్ ఒంటెద్దు పోకడ నిర్ణయం అని అంటున్నారు జనసేన నేతలు. పవన్ ఓకే అనేసి, పక్కన నాదెండ్ల మనోహర్ మమ అని అనేస్తే అయిపోయేది కాదని కాస్త గట్టిగానే చెబుతున్నట్లున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇద్దరు కీలక నేతలు జనసేనకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేయగా… అనంతరం పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేనకు రాజీనామా చేసారు. పవన్ కల్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లాలో ఇవి పవన్ కు తగిలిన రెండు బలమైన దెబ్బలు… కౌకు దెబ్బలు!

ఈ క్రమంలో తాజాగా జనసేన సీనియర్ నాయకుడు, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో… రాజీనామా చేయడానికి గల కారణాలకు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగా… 2003లో విద్యార్థి నేతగా కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణం మొదలైందని, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేసుకున్నారు కేతంరెడ్డి.

ఆ సమయలో… ఆనం వివేకానందరెడ్డి సహకారం మరువలేనిదని అన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌ ను వీడానని, యువతకు ప్రాధాన్యత కల్పిస్తానంటూ నమ్మించిన పవన్ కళ్యాణ్ ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై జనసేన పార్టీలో చేరానని తెలిపారు. పార్టీలో చేరినప్పటి నుంచి నిబద్ధత గల జనసైనికుడిగా పనిచేశానని అన్నారు.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే, ఆయనతో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించితే ప్రజలకు మరింతగా సేవ చేయగలిగే అవకాశం వస్తుందని బాగా నమ్మానని, అదే భావనతోనే ఇన్ని రోజులు జనసేనలో ఉండగలిగానని కేతంరెడ్డి చెప్పారు. ఆ ఉద్దేశంతోనే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనే సింగిల్ అజెండాతో 316 రోజుల పాటు నెల్లూరు సిటీలో “పవనన్న ప్రజాబాట” చేశానని చెప్పారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ… ఇటీవలే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారాయణను అభ్యర్థిగా ప్రకటించిందని, అప్పటికీ జనసేన – టీడీపీ మధ్య పొత్తు లేదని తెలిపారు కేతంరెడ్డి. అనంతరం… వచ్చే ఎన్నికల్లో సీటును ఆశించవద్దని, టీడీపీ తరఫున నారాయణ పోటీ చేస్తారని, ఆయన గెలుపు కోసమే పని చేయాలని సీనియర్ నాయకులు ఆదేశించారని చెప్పారు.

దీంతో తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కేతంరెడ్డి ప్రకటించారు. 2016లో తాను “సేవ్ నెల్లూరు” అంటూ పోరాటం చేసిందే నారాయణ అక్రమాల మీదని.. ఆ విషయం జనసేన నేతలకు కూడా తెలుసని.. అలాంటి వ్యక్తిని గెలిపించడానికి తాను పనిచేయలేనని తేల్చి చెప్పారు కేంతరెడ్డి. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా నారాయణ అక్రమాల మీద బలంగా తన గళాన్ని వినిపించానని గుర్తుచేశారు.

అనంతరం… పార్టీకోసం ఎంతైనా చేస్తాను కానీ… ఇప్పుడు నారాయణను గెలిపించాలనే విషయాన్ని మనస్సులో పెట్టుకుని పని చేయలేనని, అలా చేస్తే అది రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని కేతంరెడ్డి తేల్చిచెప్పారు. అందుకే అన్ని కోణాల్లో అలోచించి, కార్యకర్తలతో చర్చించి జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దీంతో వరుసగా మూడో కీలక రాజీనామా జనసేనలో చోటు చేసుకున్నట్లయ్యింది.

ఈ లెక్కన చూస్తుంటే… పవన్ విదేశీ యాత్ర అనంతరం తిరిగి ఈ నెల 26న ఇండియాకు వచ్చేసరికి కీలకమైన నేతలు, కాస్త అత్మాభిమానం ఉన్న నేతలు బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు!