మరి కొన్ని గంటలు! ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరి కొన్ని గంటల్లో ముగియబోతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్మించిన 88 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించడంతో ఈ పాదయాత్ర ముగుస్తుంది. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు.
జగన్ పాదయాత్ర ముగింపు సభను కవర్ చేయడానికి నేషనల్ మీడియా మొత్తం ఇచ్ఛాపురంలో దిగింది. నేషనల్ ఛానళ్ల విలేకరులు, ప్రతినిధులు ఒకరోజు ముందే ఇచ్ఛాపురానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం నుంచే వారు జగన్ వెంట నడుస్తున్నారు. దశలవారీగా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్న దాదాపు అన్ని టాప్ ఛానళ్ల ప్రతినిధులూ ఇచ్ఛాపురంలో కనిపిస్తున్నారు.
ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, జీ న్యూస్, ఇండియా టుడే, న్యూస్ ఎక్స్, సహారా ఇండియా వంటి ఛానళ్లు జగన్ చివరిరోజు పాదయాత్రపై లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి. బహిరంగ సభ ముగిసేంత వరకూ ఆయా ఛానళ్ల ప్రతినిధులు ఇచ్ఛాపురంలో ఉంటారు. పైలాన్‌ను నిర్మించిన కార్మికులనూ వారు పలకరిస్తున్నారు.
జగన్ పాదయాత్రపై శ్రీకాకుళం జిల్లావాసులతో పాటు, లక్షలాదిగా తరలి వచ్చిన ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతున్నారు. వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. పైలాన్ విశేషాలను తెలుసుకుంటున్నారు. జగన్ పాదయాత్రపై కొన్ని నేషనల్ ఛానళ్లలో ప్రత్యేక బులెటిన్లు ప్రసారం అవుతున్నాయి.
బహిరంగ సభ మొత్తాన్నీ లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. దీనికోసం అవసరమైన ఓబీ వ్యాన్‌లను సిద్ధం చేసుకున్నారు. జగన్ పాదయాత్రపై ఉత్తరాది రాష్ట్రాల ప్రజల్లోనూ ఆసక్తి ఉందని, ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారనే అభిప్రాయం ఉత్తరాది వారిలో కూడా ఉందని నేషనల్ మీడియా విలేకరి ఒకరు `తెలుగు రాజ్యం` ప్రతినిధికి తెలిపారు.