ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ట్విస్ట్ ఇచ్చారు. తన హక్కులకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్వయంగా కలవలేకపోయానని.. ఆయన వచ్చాక కలిసి పరిస్థితులన్నీ వివరిస్తానన్నారు. రెండు రోజుల్లో స్పీకర్‌ను కలిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు పీఎంవోలో కూడా తన సమస్యలపై ఫిర్యాదు చేస్తానని రఘురామ అన్నారు. జితేంద్ర సింగ్ అపాయింట్‌మెంట్ తీసుకున్నానని.. మంగళ, బుధవారాల్లో ఆయన్ను కూడా కలుస్తానని చెప్పారు. తనపై జరుగుతున్న అరాచకాలను, దౌర్జన్యాలను వారికి తెలియజేస్తాను అన్నారు.
తనపై జరుగతున్న కుట్రలను కూడా వివరిస్తాను అన్నారు. తన నియోజకవర్గానికి వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ అంశాలను స్పీకర్‌కు కూడా వివరిస్తానని చెప్పారు. రఘురామ కూడా ప్రివిలేజ్ నోటీస్‌తో సజ్జలపై కౌంటరిస్తున్నారు. ఎస్ఈసీపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చినట్లుగానే నర్సాపురం ఎంపీ కూడా ఆ దిశగా వెళుతున్నారు. అంతేకాదు రఘురామ గతంలో ఓ వైఎస్సార్‌సీపీ ఎంపీపైనా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.