ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ ఏపీ సర్కార్ ని పురందేశ్వరి టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ మధ్యం, కల్తీ మద్యం, సీబీఐ ఎంక్వైరీ అంటూ ఆమె హస్తినలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా స్పందించిన దాఖళాలు లేవు. మరోపక్క అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్.. ఏపీలో మద్యం పాలసీలు, ఇప్పుడున్న బ్రాండ్లకు కారకులు మొదలైన వివరాలు సవివరంగా వివరించారు. దీంతో ఆ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిందనే కామెంట్లు వినిపించాయి.
మరి ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ పురందేశ్వరి దూకుడు పెంచారు. టీడీపీ నేతలు కంటే ముందే చంద్రబాబు అరెస్టును ఆమె ఖండించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎవరూ స్పందించకపోయినా ఆమె ఈ విషయంపై పలు విమర్శలు చేస్తూ వచ్చారు! ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. టీడీపీ బీజేపీలకు ఆమె “బావ”సారూప్యత కలిపే ప్రయత్నం చేస్తున్నారని దుబ్బయట్టారు.
ఈ సమయంలో తాజాగా ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మైకందుకున్నారు. దగ్గుబాటి పురందేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ స్వామి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో బాబు కోసం కోవర్టుగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు.
అనంతరం… చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు రకరకాలుగా చెబుతున్నారని మండిపడిన నారాయణ స్వామి… చంద్రబాబుకు జైలులో భోజనం ప్రభుత్వం పెట్టడం లేదని స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి పంపుతున్నారని గుర్తుచేశారు. జైల్లో దోమలు కుడుతున్నాయని అంటున్నారని.. వాటి ద్వారా మేం ఏమైన విషం పంపిస్తున్నామా అని ఘాటుగా ప్రశ్నించారు.
అనంతరం మరింత డోసు పెంచిన ఆయన… చంద్రబాబును పంపించేసి నారా లోకేష్‌ను సీఎంగా చేయాలనే ఉద్దేశ్యంలో టీడీపీ నేతలు వున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లు ఒక స్టేట్‌మెంట్ కూడా నిజం చెప్పడం లేదని దుయ్యబట్టారు.