ప్రస్తుతం యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న నారా లోకేష్… తాజాగా టీడీపీ ఫైనల్ మేనిఫెస్టోపై స్పందించారు. ఇప్పటికే మహానాడు వేధికగా తొలివిడత మేనిఫెస్టోని విడుదల చేసిన టీడీపీ… రాబోయే రోజుల్లో మరింత ప్రభావవంతమైన మేనిఫెస్టోను రూపిందించబోతుందని తెలుస్తుంది. ఈ సమయంలో టీడీపీ ఫైనల్ మేనిఫెస్టోపై లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహానాడులో టీడీపీ మేనిఫెస్టో దాదాపు ఖరారైందని.. 80 శాతం మహానాడులో ప్రకటించినవే ఉంటాయని చెబుతున్నారు లోకేష్. అలాని పూర్తిగా సంక్షేమమే కాదు అన్నట్లుగా సంకేతాలిచ్చిన ఆయన… పరిశ్రమలు తెస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడున్న టెక్నాలజీ అనుబంధంగా కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ మారుస్తామని లోకేష్ వివరించారు. చంద్రబాబు ఒక బ్రాండ్ అని, ఆయన అధికారంలోకి రాగానే ఏపీకి కంపెనీలు క్యూ కడతాయని చెబుతున్నారు. తామొస్తే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేస్తామని.. రాయలసీమ అభివృద్ధిపై కడప జిల్లాలో పాదయాత్ర ముగించేలోపే ప్రణాళిక విడుదల చేస్తామని వెల్లడించారు.
ఆ సంగతి అలా ఉంటే… ఈ సమయంలో పొత్తులపై కూడా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తో పొత్తులపై ఇప్పటికే ఆరేడు సార్లు చర్చలు జరిగాయని చెప్పిన లోకేష్… మహానాడు కారణంగా ఇటీవల కలవలేదని తెలిపారు. త్వరలో మరోసారి పవన్ – చంద్రబాబు ఇద్దరూ కూర్చుంటారని అన్నారు. కొద్ది రోజులుగా సీఎం జగన్ కు అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో.. బీజేపీతో పొత్తుకోసం తాము ఆరాటపడటం లేదని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జనసేనలో కీలకంగా మారాయి. ఎందుకంటే… ఇప్పటికే బీజేపీ – జనసేనలు పొత్తులో ఉన్నాయి. పైగా రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీచేస్తాయని బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరోపక్క పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతోనే తన ప్రయాణం అని ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసేశారు. దీంతో… ఎన్నికలనాటికి ఈ పొత్తుల పంచాయతీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఆసక్తిగా మారింది.