టీడీపీ అనుకూల మీడియా కూడా, యువగళం పాదయాత్రకు కవరేజ్ తగ్గించిందేంటబ్బా.? తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్న ప్రశ్న ఇది. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర అనగానే, టీడీపీ శ్రేణుల్లో తొలుత కొత్త ఉత్సాహం కనిపించింది.
వైసీపీకి చెందిన ముగ్గురు పెద్దారెడ్లు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న దరిమిలా, నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరులో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంతా అనుకున్నారు.
అంతా అనుకున్నట్టుగానే, గ్రాండ్ వెల్‌కమ్ అయితే లభించింది నారా లోకేష్ యువగళం పాదయాత్రకి. కానీ, అసలు సమస్య అక్కడే మొదలైంది. ఎండలు కారణమా.? ఇంకోటైదేనా కారణం వుందా.? ఏమోగానీ, లోకేష్ పాదయాత్రలో జనం చాలా చాలా పలచగా కనిపిస్తున్నారు.
దానికి తోడు లోకేష్ ప్రసంగాలూ చప్పగా సాగుతున్నాయి. ఎందుకిలా.? లోకేష్ బహుశా నీరసించిపోయి వుండొచ్చు. ఔను, చిన్నపాటి అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ప్రధానంగా కాళ్ళ నొప్పులు.. దాంతోపాటుగా, భుజం నొప్పి.. నడుం నొప్పి కూడా వేధిస్తున్నాయట.
ఓ వైపు పెద్దగా ఖర్చు లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు వేలాది మంది కాదు, లక్షలాది మంది పోటెత్తేలా చేసుకుంటున్నారు. ఆ యాత్ర చూసి, యువగళం పాదయాత్రను పోల్చి.. తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారట.
‘ఎంత ఖర్చు చేస్తే, లోకేష్ పాదయాత్రలో ఈ జనాన్ని చూడగలం.?’ అన్న ప్రశ్న టీడీపీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది.