లోకేష్ మారలేదు.. మారేదీ లేదు.. పుంగనూరుగా భీమవరం!

యువగళం పాదయాత్ర పేరు చెప్పి రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో గుడివాడలో నిర్వహించిన పాదయ్యాత్ర సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యల సంగతి తెలిసిందే. కట్ డ్రాయర్ తో పరిగెత్తిస్తానంటూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో దూషణలు చేశారు.

ఆ పాదయాత్ర ఇప్పుడు భీమవరంలోకి ఎంటరయ్యింది. ఈ సందర్భంగా ప్రశాంతంగా ఉండే భీమవరం ఒక్కసారిగా పుంగనూరును తలపించింది. పుంగనూరు ఘటనను జ్ఞప్తికి తెచ్చేలా సాగిన ఈ దారుణం… భీమవరం చరిత్రలో ఒక చీకటి రోజు అని చెప్పినా అతిశయోత్కి కాదనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భీమవరంలో గనుపూడి సెంటర్‌ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మరోసారి రెచ్చగొట్టే ప్రసంగం చేశారు! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనా.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీను పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన పాదయాత్రలో భాగంగా నిర్వహించే సభలలో స్థానిక వైసీపీ నేతలను నోటికి వచ్చినట్లు తిట్టడం, టీడీపీ కార్యకర్తలను రెచ్చగోట్టి దాడులకు పాల్పడేలా ఉసిగొల్పడమే పనిగా పెట్టుకున్న నారా లోకేష్… తాజాగా భీమవరంలోనూ అదేపనికి పూనుకున్నారు. వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. కనీసం డజను కేసులను పెట్టించుకోవాలని, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ కనిపించినా తరిమి కొట్టాలని పదే పదే పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.

ఈ సమయంలో… రోడ్డు పక్కన పార్టీ జెండాలు చేతపట్టి నిల్చుని నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలు, గ్రంధి శ్రీనివాస్ అనుచరులపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిపైనా రాళ్లు విసరడంతో ముగ్గురు పోలీసులకు గాయాలవ్వగా… వారిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అంతకుముందే భీమవరంలో వైఎస్ జగన్‌ కు చెందిన భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలను నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలు చించివేశారు. దీంతో వైసీపీ నాయకులు నిరసన తెలియజేశారు. అనంతరం వాటిని మళ్లీ కట్టుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు!

కాగా, ఆగస్ట్‌ 4న టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో, చిత్తూరు జిల్లా పుంగనూరులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే పన్నిన పక్కా కుట్రతో టీడీపీ నేతలు, కార్యకర్తలు.. రాళ్లు, కట్టెలతో దాడి చేసి సుమారు 47 మంది పోలీసులను గాయపరిచారు. రెండు పోలీస్‌ వాహ­నాలను తగలబెట్టారు!