‘యువగళం’ పాదయాత్ర ముగిసింది. నిజానికి ముందు అనుకున్న షెడ్యూల్‌కి అనుగుణంగా నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర పూర్తి కాలేకపోయింది. ‘తారకరత్న గుండె పోటుతో మొదలైన నారా లోకేష్ పాదయాత్ర.. తారకరత్న మరణం మీదుగా సాగి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జైలుకెళ్ళడం.. బెయిల్ మీద విడుదలవడం వరకు..’ సాగిందని చెప్పాల్సి వస్తే, అందులో వింతేమీ లేదు.
తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి తారకరత్న ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలని భావించారు. దురదృష్టం, ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైన రోజే, ఆ పాదయాత్రలోనే తారకరత్నకు తీవ్ర గుండె పోటు సంభవించింది. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించగా, కొన్ని రోజులపాటు అచేతనావస్థలోనే ఆయనకు వైద్య చికిత్స అందింది. చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఇక, నారా లోకేష్ పాదయాత్ర విషయానికొస్తే, ‘రికార్డు స్థాయిలో’ అని మొదలు పెట్టి, దాన్నొక విహార యాత్రగా మార్చేశారు. ప్రతిరోజూ, పెద్దయెత్తున జనాన్ని తరలించి, నారా లోకేష్ పాదయాత్ర ‘సక్సెస్’ అనిపించాల్సి వచ్చింది. రోజువారీ చెల్లింపులకు అదనంగా, జీతాలు ఇచ్చి మరీ, రెగ్యులర్ కార్యకర్తల్ని నియమించుకోవాల్సి వచ్చింది నారా లోకేష్ పాదయాత్ర కోసం.
ఇంకోపక్క, రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా నారా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ వచ్చింది. ఈ అడ్డంకుల కారణంగానే, నారా లోకేష్ పాదయాత్ర మరింత పాపులర్ అయ్యిందనని అనొచ్చేమో కూడా.!
కాగా, నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసింది. దాంతో, నారా లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా ఆగిపోయింది. నిజానికి, అక్కడితోనే పాదయాత్ర ముగిసినట్లు భావించాలి.
అయితే, ‘మమ’ అనిపించేయడానికి అన్నట్టు, ముహూర్తం పెట్టుకుని, మరికొన్ని రోజులు పాదయాత్ర చేసి, ఎట్టకేలకు ముగించేశారు నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రని. ఈ పాదయాత్ర ద్వారా టీడీపీకి ఎంత లాభం.? అంటే, గుండు సున్నా.. అని చెప్పక తప్పదేమో.!