లోకేష్ @ 200… ఏమి చేద్దామంటావ్ మరి?

ఏపీలో టీడీపీ యువకిశోరం నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అనుకూల మీడియా సైతం ఆ పాదయాత్రను పూర్తిస్థాయిలో పట్టించుకుని, కవరేజ్ ఇవ్వకుండా ఉంటున్నా కూడా చినబాబు మాత్రం అవిరామంగా నడుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర 200 రోజులకు చేరింది. దీంతో… పార్టీకి జరిగిన మేలు ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును… నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 200 రోజుల్లో రాయలసీమలోని కుప్పం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. దక్షిణ కోస్తా జిల్లాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ 200 రోజుల్లో సుమారు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్ని చుట్టేసిన లోకేష్.. తన నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యంవైపు సాగిపోతున్నారు.

దీంతో ఆల్ మోస్ట్ సగం నియోజకవర్గాలను చుట్టేసి వచ్చిన నారా లోకేష్… ఈ పాదయాత్రతో పార్టీకి తెచ్చిన మైలేజ్ ఏమిటి.. ఆయనకు తెచ్చుకున్న బలం ఏమిటి.. కేడర్ లో కల్పించిన నమ్మకం ఏమిటి అనే విషయాలపై పార్టీలోనూ, బయటా చర్చ మొదలైంది.

లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సొంత పార్టీ నేతలతో సహా ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవన్న సంగతి తెలిసిందే. ఇది కచ్చితంగా మిడిల్ డ్రాప్ యాత్రే అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా సాయంత్రమో, రాత్రో… సమయం ఏదైనా చినబాబు మాత్రం యాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు.

అయితే… లోకేష్ పర్యటిస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల ముందు అనావసరపు ఖర్చు అనే కామెంట్లు మొదట్లో వినిపించాయి కానీ… తర్వాత అలవాటు పడిపోయారు నాయకులు! ఇదే సమయంలో స్థానిక సమస్యలపై స్పందన కంటే… అధికార పార్టీ నేతలపై వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయనే కామెంట్లు బలంగా వినిపించాయి.

ఇలా అధికారపార్టీ నేతలపై కామెంట్లు చేయడం.. అనంతరం వారంతా మైకుల ముందుకువచ్చి వాయించి వదిలిపెట్టడం రొటీన్ అయిపోయింది. పైగా కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మంత్రి రోజా, వంశీ, జోగి రమేష్ వంటి నేతలు లోకేష్ ను విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. దీంతో నాలుగు అంటున్న లోకేష్… నలభై అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ సంగతి అలా ఉంటే… యాత్ర రోజులు కుదించాలనే చర్చ పార్టీలో నడుస్తుందని తెలుస్తుంది. ఈ యాత్ర వల్ల పెద్దగా మైలేజ్ ఏమీ రావడం లేదని.. పైగా ఎన్నికల సమయంలో ఆ పనులు చూసుకోకుండా.. ఈయన వెనక తిరగడం వల్ల మొదటికే మోసం వచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారంట. దీంతో… వీలైనంతవరకూ నవంబర్ నెలాఖరు లోపు ఈ యాత్ర ముగింపు దశకు చేరుకుంటుందని అంటున్నారు.