లోకేష్ పై కోడిగుడ్ల దాడి… ఆన్ లైన్ లో దర్శనమిస్తున్న కారణాలు!

కడప జల్లా ప్రొద్దుటూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకేష్ నడచి వస్తుండగా కొంతమంది కోడిగుడ్లను దూరం నుంచి విసిరారు. టార్గెట్ ఆయనే అయినా, అవి మిస్సై ఆయన భద్రతా సిబ్బందికి తగిలాయి. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయి ఆయన్ను పక్కకు తీసుకెళ్లారు. యాత్రలో భాగంగా ఓ షాపు వద్ద ఆగి వినియోగదారులతో లోకేష్ మాట్లాడుతుండగా గుడ్లదాడి జరిగిందని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే… ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌ లో గురువారం మధ్యాహ్నం యువగళం పాదయాత్రకు సంబంధించిన బహిరంగ సభ జరిగింది. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ మీదుగా లోకేష్ పాదయాత్రగా వస్తున్నారు. దారిమధ్యలో స్థానికులతో మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే గుడ్లదాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి చితక్కొట్టారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని, ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ దాడిపై అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. కోడి గుడ్లు విసరడం.. కోడి కత్తితో పొడవడం వైసీపీ పే టెమ్ బ్యాచ్‌ కు అలవాటేనని అన్నారు. యువగళం పాదయాత్ర జన ప్రభంజనం చూసి జగన్‌కు సెంట్రల్ ఏసీలో ఉన్నా చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. లోకేష్‌పై కోడిగుడ్లు విసిరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

అయితే విమర్శలు చేసే ముందు వెనకా ముందు చూడకుండా.. దేవుడు నోరిచ్చాడు, టెంట్ హౌస్ వాళ్లు మైకిచ్చారని ఏది బడితే అది మాట్లాడకూడదని.. కాస్త వెనకా ముందూ చూసుకుని మాట్లాడాలని.. అలాకానిపక్షంలో అవతలి వారికి కూడా అభిమానులు ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని.. విమర్శలు కూడా హేతుబద్దంగా ఉండాలే తప్ప – అడ్డగోలుగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తుండటం కొసమెరుపు.