రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ టీడీపీ ఒంటరిగా పోటీచేస్తుందా..? ఒక వేళ జనసేనతో పొత్తులో ముందుకెళ్తే… సీట్ల సర్ధుబాటులో తమ్ముళ్లతో సమస్య రాదా..? ఒకవేళ కమ్యునిస్టులు కూడా కలిస్తే.. వాళ్లకీ తులమో ఫలమో సీట్లు ఇవ్వాలి కదా..? ఇన్ని సమస్యల మధ్య కొంతమంది నేతలు ఆలోచిస్తుంటే… చినబాబు మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అవును… వచ్చే ఎన్నికల్లో ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వబోమని టీడీపీ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించిందని అంటున్నారు. అందులో భాగంగానే గోదావరి జిల్లాలో యనమల కుటుంబానికి, సీమ జిల్లాల్లో కోట్ల విజయభాస్కరరెడ్డి – కేఈ కృష్ణమూర్తి – జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలకు రెండు సీట్లు ఇవ్వబోమని చంద్రబాబు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయంలో సీరియస్ గానే ఉంటామని, కొత్త రక్తానికి పార్టీలో అవకాశం ఇవ్వాలని సూటిగా చెప్పినట్లు వార్తలొచ్చాయి.
అయితే… ఆ రూల్ ని లోకేష్ బ్రేక్ చేశారు. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో భాగంగా… అధికారపార్టీ నేతలపై విమర్శల్లో సంచలనాలకు మారుపేరుగా మారుతున్న చినబాబు… రెండు కీలక నియోజకవర్గాలకు గానూ ఒకే కుటుంబ సభ్యులను అభ్యర్థులను ప్రకటించారు. అవును… రాఫ్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీతను అభ్యర్థిగా ప్రకటించిన లోకేష్… ధర్మవరం నియోజకవర్గానికి ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు.
దీంతో… సీనియర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీడీపీలో కీలకంగా ఉన్న యనమల రామకృష్ణుడు – కోట్ల విజయభాస్కరరెడ్డి – కేఈ కృష్ణమూర్తి – జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలకు కూడా రెండు సీట్లు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కాగా… వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా “యువగళం” పేరుతో ముందుకు కదులుతూ కేడర్ లో కదలికలు తెస్తున్న లోకేష్ పాదయాత్ర 59వ రోజుకు చేరుకుంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది.