నారా లోకేష్ పాదయాత్రకి అర్థాంతర ముగింపు.?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర వల్ల ఉపయోగమెంత.? అన్న విషయమై ఆ పార్టీలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ‘పాదయాత్ర దండగ’ అన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోందిట. ‘పాదయాత్రను భరించడం ఆర్థికంగా పార్టీకి ఇబ్బందికరం’ అని సీనియర్లు అధినేత చంద్రబాబుకి సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

రోజుకి దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతోందంటూ నారా లోకేష్ పాదయాత్ర గురించి జన బాహుళ్యంలో చర్చ జరుగుతోంది. మరీ అంతలా ఖర్చవుతుందా.? అంటే, ఈ రోజుల్లో ‘మినిమమ్ ఖర్చులు’ లేకుండా కార్యకర్తలు సైతం, నాయకుల వెంట తిరగడంలేదు. మినిమమ్ ఖర్చులంటే రోజుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు.

అద్దెకు తెచ్చే రాజకీయ కూలీలతో సమానంగా, ఆ మాటకొస్తే ఇంకాస్త ఎక్కువ మొత్తం పార్టీ కార్యకర్తలకీ చెల్లించుకోవాల్సిందే. సరే, ఖర్చు చేయడం టీడీపీకి పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ, ఈ ఖర్చు ఏదో వచ్చే ఎన్నికల్లో పెట్టుకుంటే బెటర్.. అని పార్టీలో చర్చ జరుగుతోందిట. ‘ఇప్పుడే స్థానిక నాయకులు అప్పుల పాలైపోతే.. ముందు ముందు ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి వస్తే ఎలా.?’ అంటూ కింది స్థాయి నుంచి అధినాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోందట. పైగా, పాదయాత్రకు స్పందన అంతంతమాత్రమేననీ.. అప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో ‘హై’ కనిపిస్తున్నా, ఆ తర్వాత షరామామూలుగానే చల్లారిపోతుందని డెయిలీ ఫీడ్ బ్యాక్ చంద్రబాబుకి అందుతోందిట.

సరైన కారణం చూపి, పాదయాత్రను అర్థాంతరంగా ఆపెయ్యాలనే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్నట్లు తెలుస్తోంది.