నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇప్పుడు ఆ బాటలోనే నారా లోకేష్ కూడా పాదయాత్ర చేయబోతున్నారు. జనవరి నెలాఖరు నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీని అధికార పీఠమెక్కించడమే లక్ష్యంగా నారా లోకేష్ ఈ పాదయాత్ర చేయబోతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ఈ పాదయాత్ర జనవరి 27న ప్రారంభం కాబోతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర జరగనుందట. పాదయాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ బహిరంగ సభలు నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. పాదయాత్రలోనే, ఇతర పార్టీల నుంచి నాయకుల్ని టీడీపీలోకి తీసుకురావడం, ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని ఖరారు చేయడం వంటి అంశాలపైనా టీడీపీ ఫోకస్ పెడుతుంది.

ఆయా నియోజకవర్గాల్లో ప్రాంతీయ సంస్థల్ని ప్రస్తావించడం వంటివి పాదయాత్రలో సహజంగానే అన్ని రాజకీయ పార్టీలూ చేసే పనే. అదే పని టీడీపీ కూడా చేయబోతోంది. మధ్య మధ్యలో చంద్రబాబు బస్సు యాత్రలు చేసేలా కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. 2019 ఎన్నికలు ముందు వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడాలున్నాయ్. శాంతి భద్రతల సమస్య పేరుతో రాజకీయ యాత్రల్ని అధికార వైసీపీ అడ్డుకుంటోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర సజావుగా సాగుతుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వ్యక్తమవుతుండడం గమనార్హం.