ఏపీ పోలీసులకి నారా లోకేష్ ‘క్లాసు’.!

అదేంటో, అధికారంలో వున్నప్పుడు పోలీసు వ్యవస్థని అడ్డగోలుగా వాడేసి, ప్రతిపక్షంలో వున్నప్పుడు, అదే పోలీస్ వ్యవస్థకు క్లాస్ పీకుతుంటారు.. పద్ధతిగా ఎలా వుండాలో చెబుతూ.! ఎవరు అధికారంలో వున్నా ఇదే తంతు.!

2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని అప్పటి అధికార టీడీపీ ఎలా అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీదకి ఉసిగొల్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా, ఉరికించేశారు అప్పట్లో పోలీసులు.! సినీ నటి, నగిరి ఎమ్మెల్యే రోజా అప్పట్లో టీడీపీ దాష్టీకానికి ప్రధాన బాధితురాలయ్యారు.

తమ హయాంలో పోలీసు వ్యవస్థని అడ్డగోలుగా వాడేసుకుని, ఇప్పుడు తీరిగ్గా పోలీసు శాఖకు నీతులు చెబుతున్నారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్.!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా కొంత గలాటా చోటు చేసుకుంది. అధికార పార్టీ మీద లోకేష్ చేస్తున్న అడ్డగోలు విమర్శలు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి మీద చేస్తున్న దూషణల నేపథ్యంలో, పోలీసు శాఖ ‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు’ అంటూ నోటీసులు ఇచ్చింది.

అయితే, పోలీసు అధికారులు తీసుకొచ్చిన నోటీసుని తీసుకునేందుకు నిరాకరించిన లోకేష్, ‘ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు వైఎస్ జగన్ కూడా నానా రకాలుగా మమ్మల్ని దూషించారు. ఆయన మీద మేం చర్యలు తీసుకోలేదు. మాకెందుకీ నిబంధనలు.?’ అంటూ లోకేష్ ప్రశ్నిస్తున్నారు.

‘వైసీపీ ఇప్పుడు మీ మీద పెడుతున్న ఫ్లెక్సీలను మీరు అడ్డుకోవడంలేదు. అందుకే, మేం కూడా అదే ఫాలో అవుతున్నాం..’ అన్నది లోకేష్ వెర్షన్. ఒక్కటి మాత్రం వాస్తవం.. రాజకీయ పార్టీల రాజకీయ కక్షలకు పోలీసు వ్యవస్థ బలైపోతోంది.!