శృతిమించుతున్న లోకేష్ ఫ్రస్ట్రేషన్… కీబోర్డులకు పనిచెబుతున్న నెటిజన్లు!

“యువగళం” పేరుమీద లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అనుకూల మీడియా సైతం లోకేష్ పాదయాత్రపై ఫుల్ ఫోకస్ తగ్గించడం. వార్తలను సైతం లోపల పేజీలకు పరిమితం చేయడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందని అంటున్నారు పరిశీలకులు. ఇదే క్రమంలో… న్యాయస్థానాల్లో వరుసపెట్టి ఏపీ సర్కార్ కు అనుకూలంగా తీర్పులు రావడం కూడా చినబాబు ఫ్రస్ట్రేషన్ కి కారణం అని తేల్చేస్తున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ లో లోకేష్ నోరు జారుతున్నారు!!

ప్రస్తుతం కర్నూలు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలపైనా, మంత్రులపైనా ఎక్కడికక్కడ ఎడాపెడా విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ సందర్భంగా “సిట్”పై స్పందించారు నారా లోకేష్. గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం విచారణకు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై లోకెష్ తీవ్రస్థాయిలో స్పందించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా.. కొండను తవ్వి ఎలుకను కాదు కదా.. ఎలుక తోకను కూడా పట్టుకోలేనివాళ్లు “సిట్”వేసి ఏం పీకుతారని నారా లోకేష్ ప్రశ్నించారు. తాము జైలుకెళ్లే సంగతి పక్కనపెడితే.. జగన్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ జైలుకెళ్లాల్సిందేనన్నారు. ఈ నేపథ్యంలో మద్యం తీసుకెళ్తున్న వాహనం వద్ద సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లోకేష్. అక్కడితో ఆగని ఆయన… జీవితాంతం జైలులో ఉండ‌డానికి రెడీగా ఉండు కంత్రీ రెడ్డి అంటూ శృతిమించిన విమర్శ చేశారు.

దీంతో… కీబోర్డులకు పనిచెబుతున్న నెటిజన్లు సీరియస్ గా స్పందిస్తున్నారు. జగన్ ని తిట్టాలనుకుంటే పరిపాలనపైనా, తీసుకుంటున్న నిర్ణయాలపైనా తిట్టాలి కానీ… కంత్రీ “రెడ్డి”అని, దొంగ “రెడ్డి” అని, జే బ్రాండ్ “రెడ్డి” అని ఒక సామాజికవర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఈ నోటిదురద వల్లే పార్టీకి దూరం చేసుకున్నారని.. ఇప్పుడు రెడ్లను కూడా దూరం చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

మరి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న “సిట్” పై టీడీపీ నాయకులు, చినబాబు, చంద్రబాబులు ఇంత చులకనగా మాట్లాడుతుంటే… సిట్ కు నిజంగానే అంత సీన్ లేదేమో అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నిజంగా సిట్ కు అంత సీన్ ఉంటే.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగి ఉంటే.. ఎందుకు మీనమేషాలు లెక్కెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.