2019లో ఓడింది టీడీపీ కాదు, ఆంధ్రప్రదేశ్: నారా లోకేష్

‘మీకు బుద్ధి లేదా.? వైసీపీని ఎలా గెలిపిస్తారు.?’ అంటూ స్థానిక ఎన్నికల వేళ ఓటర్లపై మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఆ దెబ్బకి టీడీపీని మరింత కసిగా ఓడించేశారు జనం. ఎవర్ని గెలిపించాలి.? ఎందుకు గెలిపించాలి.? అన్నదానిపై జనానికి ఖచ్చితమైన అవగాహన వుంటుంది.

సరే, జనం అంచనాలు తప్పడం అనేది కొత్త విషయం కాదు. ప్రజాస్వామ్యంలోని ప్రత్యేకతే అది. ఆ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు కరెన్సీ నోట్లు శాసిస్తున్నాయ్.. అన్నది మళ్లీ వేరే చర్చ.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లకీ, మూడు లోక్ సభ సీట్లకీ పడిపోయింది. అధికారంలో వున్న పార్టీ, ఇంత దారుణంగా ఓడిపోవడమంటే ఆషామాషీ విషయం కాదు. అప్పటి ప్రతిపక్షం వైసీపీకి బంపర్ మెజార్టీ.. ఆ మాటకొస్తే ల్యాండ్ స్లైడ్ విక్టరీని ప్రజలే అందించారు.

వైసీపీ గెలుపు.. ప్రజలు ఇచ్చిన గెలుపు. టీడీపీ ఓటమి కూడా ప్రజలు ఇచ్చిన ఓటమే. కాదు కాదు.. ఓడిపోయింది టీడీపీ కానే కాదు.. ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే.. అంటున్నారు టీడీపీ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.

‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ చిత్ర విచిత్రమైన మాటల విన్యాసాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఇదొకటి. ‘ఔను, మేం ఓడిపోయాం.. ఈసారి గెలిపించండి.. మంచి చేస్తాం.. కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయాం.. చెయ్యాలనుకున్నవి ఫలానా కారణాల వల్ల చెయ్యలేకపోయాం’ అని చెప్పాలి.. అప్పుడు పద్ధతిగా వుంటుంది.. జనాల్లో కాస్తో కూస్తో సింపతీ అయినా వస్తుంది టీడీపీ పట్ల. అంతేగానీ, రాష్ట్ర ప్రజలు ఓడిపోవడమేంటి.? టీడీపీ గెలిస్తే రాష్ట్రం గెలిచినట్లు.. టీడీపీ ఓడితే, రాష్ట్రం ఓడిపోయినట్లు.!