“పందుల గుంపు పంచ్” పై లోకేష్ కామెంట్స్ వైరల్!

యువగళం పాదయాత్రలో ఫుల్ దూకుడు మీదున్నారు చినబాబు నారా లోకేష్. తనదైన వాక్ చాతుర్యంతో, యతిప్రాసల ప్రసంగాలతో జనాల్లో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన పేల్చుతున్న డైలాగులు జనాలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని కలిగిస్తున్నాయి. కాకపోతే… ఆ డైలాగులు అతి తక్కువ సమయంలోనే బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి.. తిరిగి సమాధానం చెప్పలేని కౌంటర్లకు నెలవవుతున్నాయి. ఇప్పుడు ఇదే టీడీపీకి ఉన్న పెద్ద సమస్య.

అధికార వైసీపీపై నారా లోకేష్ బలమైన పంచ్ డైలాగులే పేలుస్తున్నారు.. వాటికి అక్కడున్న జనాలు ఫుల్ అప్లాజ్ ఇస్తున్నారు. అయితే… వెంటనే అవి రివర్స్ కొడుతున్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుండా మాట్లాడుతున్నారు లోకేష్. అప్పటికి కేడర్ హ్యాపీనే కానీ.. నెటిజన్లు ఆన్ లైన్ వేదికగా చినబాబుని వాయించి వదిలిపెడుతున్నారు. పైగా వైసీపీ ట్రోల్స్ కి లోకేష్ డైలాగులు ముడిసరుకుగా మారుతున్న పరిస్థితి.

ఈ క్రమంలో తాజాగా రజినీకాంత్ పై వైసీపీ నేతలు వరుసపెట్టి చేస్తున్న విమర్శలకు యువగళం యాత్రలో నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. “నాన్నా పందులే గుంపుగా వస్తాయ్, సింహం సింగిల్ గా వస్తుంది” అంటూ శివాజీ సినిమాలో రజినీ ఫేమస్ డైలాగ్ ని బహిరంగ సభలో తనదైన శైలిలో చెప్పారు లోకేష్. రజినీకాంత్ సింగిల్ గా సింహంలా వచ్చి మాట్లాడి వెళ్లిపోయారని.. ఆ తర్వాత వైసీపీ నేతలే గుంపులు గుంపులుగా వచ్చి ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఆయన ఉద్దేశ్యంలో ఆ డైలాగ్ కి అర్ధం!

అయితే… దీనిపై కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు. ఏపీలో సింహం జగన్ ఒక్కరే అని, ఆయన సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగుతున్నారని, గుంపులుగా వచ్చే పందులెవరో అందరికీ తెలుసని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సింగిల్ గా సింహంలా వచ్చే దమ్ము లోకేష్ కి ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అలాకానిపక్షంలో… సింహం జగన్ అని ఒప్పుకుని, మీరేమిటో చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. దీంతో… రజినీకాంత్ డైలాగ్ ని లోకేష్ బాగానే చెప్పినా… ఈ కౌంటర్లకు మాత్రం టీడీపీ కేడర్ తట్టుకోలేకపోతోంది. కొంతమంది తమ్ముళ్లైతే… ఎందుకు లేపి మరీ తన్నించుకోవడం అని గుసగుసలాడుతున్నారు!