మిషన్ రాయలసీమ… “బాబు”ను పాతాళానికి తొక్కేస్తున్న చినబాబు!

అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో రాయలసీమ రూపురేఖలు మారుస్తామని, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని. వాటర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు అందిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేస్తామని ఏపీ టీడీపీ నేత నారా లోకేష్ తాజాగా “మిషన్‌ రాయలసీమ” పేరుతో జరిగిన బహిరంగ సభలో స్పందించారు.

అనంతరం… జగన్‌ వచ్చాక 4 ఏళ్లలో సీమ 30 ఏళ్లు వెనక్కి పోయిందని, మహిళలు బిందెలు పట్టుకుని నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి మరోసారి అధికారం ఇస్తే రాయలసీమను రతనాల సీమ చేస్తామనస్థాయిలో హామీలు కురిపించారు. దీంతో లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు, సామాన్య ప్రజలు!

లోకేష్ కు జనాల్లో తిరగడం ఇది ఫస్ట్ టైం కావొచ్చు.. ఇలాంటి హామీలు ఇవ్వడం కూడా తొలిసారి అయ్యి ఉండొచ్చు.. ఇంతకాలం అద్దాల మేడల్లో ఉండటం వల్ల రాయల్సీమలో ప్రజల కష్టాలు కనిపించి ఉండకపోవచ్చు.. చిత్తురు జిల్లాలో పుట్టి పెరిగినా నారావారిపల్లె తప్ప పక్క గ్రామాన్ని కూడా చూసి ఉండకపోవచ్చు. అయితే… చంద్రబాబు కు ఇప్పుడు 74 ఏళ్లు! అందులో 40 ఏళ్లకు పైబడి రాజకీయాల్లో ఉన్నారు. అందులో 14ఏళ్ల పాటు ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఇప్పుడు రాయలసీమ వెనకబడిపోయిందని, తాగటానికి మంచినీళ్లు లేవని చెబుతున్న లోకేష్… ఈ విషయంలో ముందుగా తప్పుపట్టాల్సింది చంద్రబాబు నాయుడినే అన్న విషయం గుర్తుచేస్తున్నారు ఏపీ ప్రజానికం. రాయలసీమలో పుట్టిపెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకి తాజాగా లోకేష్ కి కనిపించిన సీమ కష్టాలు ఇంతకాలం ఎందుకు కనిపించలేదు? కనిపించినా చూసీ చూడనట్లు పోయారా?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో సీమ నాశనం అయిపోయిందని చినబాబు చెబుతున్నారు. అంటే… గతంలో అద్భుతంగా ఉందని చెప్పదలచుకున్నారా? లేక, జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఇంటింటికీ మంచినీరందించిన కుళాయిలను తీసేశారా? పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా.. తన సొంత నియోజకవర్గం కుప్పం మీదుగా వెళ్లే సాగునీటి కాలువను కూడా పూర్తి చేయలేకపోయిన చంద్రబాబు చిత్తశుద్ధిపై లోకేష్ ఏమి చెప్పదలచుకున్నారు?

“మిషన్ రాయలసీమ” సందర్భంగా లోకేష్ స్పందించిన విషయాలపై మచ్చుకు కొన్ని ఎదురు ప్రశ్నలు ఇవి. వీటిలో ఒక్క ప్రశ్నకైనా లోకేష్ సమాధానం చెప్పగలరా అనేది ఇక్కడ మరో పెద్ద ప్రశ్న! మరి ఈ విషయాలు మరిచిన లోకేష్… ఏదో కొత్త పార్టీ నాయకుడిలా, ఇప్పటి వరకూ అధికారంలోకి రాని పార్టీ నాయకుడిలా మాట్లాడటమే హాస్యాస్పదంగా ఉందనేది బలంగా వినిపిస్తున్న కామెంట్!!

ఫలితంగా… చంద్రబాబు పూర్వ వైభవంపై ప్రజలు చర్చించుకునే పరిస్థితి తెరపైకి తెస్తున్నారనేది మరో విమర్శ. దీంతో… తెలిసో తెలియకో చంద్రబాబును లోకేష్ పాతాళానికి తొక్కేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు!