పావలాకి పది రూపాయల బిల్డప్ టీడీపీకి కొత్తేమీ కాదు. నారా లోకేష్ విషయంలో అదే జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్, ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అలా ఆ భేటీ జరగడం వెనుక, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది బహిరంగ రహస్యం.
తన తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి నారా లోకేష్ చాలా కష్టపడుతున్నారు. సోదరి భువనేశ్వరి కోసం పురంధరీశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా తన పదవిని ఉపయోగించుకుని, అధిష్టానం వద్ద అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.
ఇదిలా వుంటే, లోకేష్ ఢిల్లీ టూర్ దెబ్బకి వైసీపీ వణుకుతోందంటూ తెలుగు తమ్ముళ్ళు హడావిడి చేశారు. అమిత్ షా స్వయంగా నారా లోకేష్‌కి సమాచారం పంపి, పిలిపించుకున్నారంటూ ప్రచారం షురూ అయ్యింది.
ఇదంతా నాణేనికి ఓ వైపు.! బీజేపీనే టీడీపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోందంటూ టీడీపీ అనుకుల మీడియా చేస్తున్న ప్రచారం ఇంకో వైపు. ‘మేం ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమికి సమదూరంలో వున్నాం..’ అని లోకేష్ ప్రకటించడం మరో ఆసక్తికర అంశం.
‘మేం ఎన్డీయేలో లేం..’ అని నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. కానీ, నాలుగు ఎంపీ సీట్లతోపాటు 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా వుందంటూ పురంధేశ్వరి సమక్షంలో అమిత్ షా దృష్టికి టీడీపీ ప్రతిపాదనను లోకేష్ తీసుకెళ్ళినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ లాంటి పెద్ద మాటలు లోకేష్ విషయంలో వాడెయ్యలేం. కానీ, తెలుగు తమ్ముళ్ళు వాడేస్తున్నారు.