సమాజంలో హిజ్రాల పట్ల నిర్లక్ష్యపూరితమైన వాతావరణం కనిపిస్తుంటుంది. కొంతమంది షాప్స్ ఓపెనింగ్స్ కి, మరికొన్ని శుభకార్యాలకి వీరిని పిలుస్తుంటారు. వీరు రావడం అదృష్టమని నమ్ముతుంటారు. మరికొంతమంది ప్రజలు వీరిని పెద్దగా పట్టించుకోరు. ఫలితంగా మెజారిటీ హిజ్రాలు భిక్షాటన చేస్తూ పొట్ట పోసుకుంటారు. అయితే… వారి సమస్యలను చెప్పుకోవడానికి తాజాగా చినబాబు లోకేష్ ను కలిశారు హిజ్రాలు!
ఏపీలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత లోకేష్ బాబును.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొంతమంది హిజ్రాలు కలిశారు. సమాజంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్న తమకు అండగా నిలవాలని వినతిపత్రం ఇచ్చారు. తమకు ఎటువంటి జీవనోపాధి లేదని, ఫలితంగా.. దారిద్ర్యంలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని చినబాబుని కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హిజ్రాలు… టీడీపీ ప్రభుత్వం తమకు రూ.1500 పింఛన్ ఇచ్చేదని.. ఇళ్లు లేనివారికి స్థలాలు కేటాయించిందని.. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమకు పింఛన్లు నిలిపివేశారని లోకేష్ ముందు వాపోయారు.
దీంతో… స్పందించిన లోకేష్… నేనున్నాను.. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన చూసుకుంటారు.. మనకు మంచిరోజులు రాబోతున్నాయంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ దేశంలోనే మొదటిసారిగా హిజ్రాల సమస్యలను గుర్తించి వారికి పింఛన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని.. 2018 జనవరిలో జీవో 7 ద్వారా రాష్ట్రంలోని సుమారు 30 వేల మంది హిజ్రాలకు పింఛన్లు మంజూరు చేశామని లోకేష్ తెలిపారు.
ఇదే క్రమంలో… హిజ్రాల సంక్షేమం కోసం సుమారు రూ.20 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుదేనని తెలిపిన లోకేష్… టీడీపీ అధికారంలోకి రాగానే హిజ్రాల పింఛన్లను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా… స్వయం ఉపాధిని కోరుకునే హిజ్రాలను తాము ప్రోత్సహిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికలతో జగన్ పాలన పోతుందని.. మన పాలన రాబోతుందని వారికి ధైర్యం చెప్పారు! దీంతో… లోకేష్ ను కలిసి, వినతిపత్రం ఇచ్చిన హిజ్రాలంతా హర్షం వ్యక్తం చేశారు!