అచ్చెన్నకు ఇంటిపోరు… చినబాబు సరికొత్త వ్యూహం?

పైకి చెప్పకపోయినా అచ్చెన్నాయుడు అంటే చినబాబు లోకేష్ కి అస్సలు పడదని, తన తండ్రి చంద్రబాబు కోసం తప్పక అచ్చెన్నను భరిస్తున్నారని ఒక వర్గం చెవులుకొరుక్కుంటూ ఉంటుంది! “పార్టీ లేదూ %$#& లేదు” అని అన్నప్పటి తర్వాత అచ్చెన్నపై లోకేష్ ఆగ్రహం మరింత పెరిగిందని అంటుంటారు. అయితే తాజాగా అచ్చెన్నకు చెక్ పెట్టడానికి చినబాబు ఒక స్కెచ్ వేశారని తెలుస్తుంది!

ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు అచ్చెన్నాయుడు. ఆ పదవి ఏ సమయంలో వచ్చింది.. ఎలాంటి పరిస్థితుల్లో దక్కింది అనేది తెలిసిన విషయమే. అయితే అప్పటినుంచి పార్టీలో నెంబర్ 2 గా అచ్చెన్న చలామణీ అవుతున్నారని లోకేష్ టీం భావిస్తూ ఉంటుంది! అయితే సపోజ్.. ఫర్ సపోజ్.. రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మంత్రి పదవులు, ఉపముఖ్యమంత్రి పదవులు అంటూ తాను ఎదగడంతోపాటు, తనకంటూ ఒక వర్గాన్ని సృష్టించుకున్నా ఆశ్చర్యం లేదని లోకేష్ ఆలోచిస్తున్నారంట!

ఇందులో భాగంగా అచ్చెన్నకు ఇప్పటినుంచే చెక్ పెట్టాలని భావిస్తున్న చినబాబు & కో… అందుకోసం రామ్మోహన్ నాయుడిని వాడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అవును… ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడుని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని.. ఫలితంగా శ్రీకాకుళంలోనే అచ్చెన్నకు చెక్ పెట్టాలని చినబాబు భావిస్తున్నారంట. ఇప్పుడు ఏపీ టీడీపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం శ్రీకాకుళం లో టెక్కలికి అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో నరసన్నపేట నుంచి రామ్మోహన్ నాయుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చినబాబు భావిస్తున్నారంట. ఇందులో భాగంగా ఇప్పటికే రామ్మోహన్ కి హిట్ కూడా ఇవ్వడంతో… స్థానికంగా ఆ నియోజకవర్గంలో దూకుడు పెంచారని, చేరికలు, విందులూ వినోదాలూ అంటూ హడావిడి చేస్తున్నారని అంటున్నారు! అయితే… దీనివల్ల రేపు పార్టీ అధికారంలోకి వస్తే పదవుల పంపకాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని చంద్రబాబు వారిస్తున్నా… చినబాబు వినడం లేదన్ని అంటున్నారు!!

అయితే ఈ విషయాలపై చినబాబు మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నారని.. రామ్మోహన్ కు ఈ మేరకు అభయం ఇచ్చారని.. ఫలితంగా ఆయన కూడా నరసన్నపేటలో దూకుడు పెంచారని తెలుస్తుంది. ఫలితంగా… ఎర్రన్నాయుడుకు అసలైన వారసుడు రామ్మోహనే అని చాటి చెప్పాలని లోకేష్ ప్రయత్నం అని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ ప్రతిపాదనను ఎంతవరకూ ఆమోదిస్తారు.. దీనిపై అచ్చెన్న ఎలా రియాక్ట్ అవుతారు.. ఈ కొత్త వ్యూహాల వల్ల అసలుకే ఎసరొస్తుందా అనేది వేచి చూడాలి! ఏది ఏమైనా… గత కొంతకాలంగా దూకుడు పెంచిన లోకేష్ మాత్రం… తనకు తాను ఇండివిడ్యువల్ గా ఒక టీం ని సెట్ చేసుకుంటున్నారని మాత్రం తెలుస్తుంది!