మంగళగిరి టాక్స్… ఈసారి లోకేష్ ను ఏమి చేద్దామనుకుంటున్నారు?

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా గెలిచి నిలవాలని, అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జనసేనను కూడా కలుపుకుని కాపు ఓట్లను కూడా కలుపుకునే పనికి పూనుకుంది. ఇదే సమయంలో వీలైతే బీజేపీ.. కాదంటే కమ్యునిస్టులను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని భావిస్తుంది. ఆ సంగతి అలా ఉంటే… అటు కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ ని ఓడించాలని వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది.

ఈ క్రమంలో మంగళగిరిలో ప్రస్తుత పరిస్థితిపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా… ఈసారి కుప్పంలో త్రిముఖ పోరు కన్ ఫాం అని తెలుస్తుంది. పైగా… ఈ త్రిముఖ పోరు అల్లాటప్పాగా ఉండదని.. ఉన్నంతలో భారీగానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. దీంతో… అసలు మంగళగిరిలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, చినబాబు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి.. త్రిముఖ పోరులో ఎవరి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం…!

వాస్తవానికి… మరోసారి మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించాలని వైసీపీ చూస్తోంది. ఈసారి కూడా లోకేష్ ని ఓడించేస్తే… పొలిటికల్ గా దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో పాటు.. టీడీపీ దుకాణ్ బంద్ అవుతుంది అన్నది వైసీపీ వ్యూహం. ఈ క్రమంలోనే టార్గెట్ లోకేష్ అనే కార్యక్రమంలో భాగంగా… సామాజిక సమీకరణలను చూసుకుంది. ఇందులో భాగంగానే బీసీ నేత అయిన గంజి చిరంజీవిని అభ్యర్ధిగా నిలబెడుతోంది.

ఈ విషయాన్ని వైసీపీ ఎంత సీరియస్ గా తీసుకుందంటే… దీనికోసం తమకు అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని సైతం పక్కన పెట్టేసింది. దీంతో… మంగళగిరిలో లోకేష్ ని ఓడించాలని వైసీపీ ఏస్థాయిలో కంకణం కట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై వేలపై చిలుకు ఓటర్లు ఉన్నారు. అంటే ఇది చాలా పెద్ద నియోజకవర్గం అనే చెప్పాలి.

ఇందులో అత్యధిక శాతం ఓట్లు బీసీలవే. ఇక ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీ చెయబోతున్న గంజి చిరంజీవి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. అంటే… అంత టఫ్ ఫైట్ కి ఇక్కడ చోటు ఉంటుంది. ఈ క్రమంలో గంజి చిరంజీవి 2019 ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లడంతో పార్టీ ఆయనను ఆదరించి నామినేటెడ్ పదవి ఇచ్చింది. 2024లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తోంది.

ఈ సమయంలో బీసీలు కీలకంగా ఉన్న నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీచేస్తున్న వారిలో గంజి చిరంజీవి మాత్రమే బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. ఇదే సమయంలో బీసీ వర్గంలో మంచి పట్టు ఉండటంతో పాటు గతంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచిన మురుగుడు హనుమంతరావు వైసీపీలోనే ఉన్నారు. దీంతో బీసీ ఓట్లపై వైసీపీ ఫుల్ టార్గెట్ పెట్టిందని తెలుస్తుంది.

ఇదే సమయంలో… ఎస్సీ, క్రీస్టియన్, ముస్లిం, రెడ్ల ఓట్లలో మెజారిటీ షేరు ఎలాగూ వైసీపీకి ఉంటుందని అంటున్నారు. మరోపక్క రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని తెలుస్తుంది! దీంతో… మంగళగిరిలో మంగళగిరిలో లోకేష్ కు ఈసారి బలమైన పోటీ ఉండే అవకాశం ఉంది. ఈసారి లోకేష్ గెలవాలంటే… మంగళగిరిలో పూర్తి కాన్సంట్రేషన్ చేయాలి. అలా కానిపక్షంలో… వైసీపీ లక్ష్యం నెరవేరే ప్రమాదం లేకపోలేదు!