నారా లోకేష్‌కి అనూహ్యమైన మద్దతు లభిస్తోందా.?

వారం పది రోజుల్లో కాళ్ళు నొప్పులు పుట్టి, పాదయాత్ర మానేస్తాడంటూ నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర గురించి మొదట్లో చాలా వెటకారపు అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి మీడియా, రాజకీయ వర్గాల్లో.

ఒకవేళ కష్టపడి పాదయాత్ర చేసినా, పార్టీని ఇరకాటంలో పెట్టేలా నారా లోకేష్ మాటలు తడబడతాయనీ చాలామంది అంచనా వేశారు. కానీ, లోకేష్ మాత్రం పట్టుదలతోనే పాదయాత్రను పూర్తి చేసేసేలా కనిపిస్తున్నారు. ఇది కాస్తంత ఆశ్చర్యకరమైన విషయమే.

సరే, లోకేష్ యాత్ర కోసం జనాన్ని తరలించడం అనేది సర్వసాధారణమైన విషయం. ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయ కార్యక్రమాల్లో జనాలెందుకు స్వచ్ఛందంగా పాల్గొంటారు.? ఆ అవకాశమే లేదు.

లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీ మైలేజ్ పెరుగుతోందన్నది నిర్వివాదాంశం. అయితే, అది టీడీపీకి అధికారం తెచ్చేంతలా పెరుగుతుందా.? లేదా.? అన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. లోకేష్ పాదయాత్రలోనే, టిక్కెట్లను ఖాయం చేసుకునేందుకు నాయకులు పోటీ పడుతున్నారు.

లోకేష్ ఓ వైపు యువగళం పాదయాత్ర చేస్తోంటే, చంద్రబాబు కూడా ‘ఏం ఖర్మ ఈ రాష్ట్రానికి..’ అనే కార్యక్రమంతో హంగామా చేస్తున్నారు. కాగా, ఓ రోజు మైలేజ్ పెరుగుతోంటే, ఇంకో రోజు డల్ అయిపోతోంది.. ఇలా ఎందుకు జరుగుతోందన్నదానిపై టీడీపీలో అంతర్మధనం షురూ అయ్యిందట. మొత్తంగా చూస్తే, నారా లోకేష్ ‘యువ నేత’ అనిపించుకుంటున్నాడన్నది తెలుగు తమ్ముళ్ళ ఉవాచ.