లోకేష్‌కి సీఎం పదవి.! చంద్రబాబు అంత రిస్క్ చేస్తారా.?

ఏమో గుర్రం ఎగరావచ్చు.? అన్నట్టుంది టీడీపీ పరిస్థితి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు వున్నారో లేదో తెలుగు తమ్ముళ్ళకే అర్థం కావడంలేదు. ‘త్యాగాలకు సిద్ధం కావాలి..’ అంటూ ఓ వైపు పార్టీ ముఖ్య నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టతనిస్తున్నారు.

ఇంకో వైపు, నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి.. అంటూ టీడీపీలో ఓ గ్రూపు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. టీడీపీ – జనసేన కలుస్తాయా.? ఈకాంబినేషన్‌తో బీజేపీ కూడా చేతులు కలుపుతుందా.? టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందా.? ఇలాంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.

నారా లోకేష్ పాదయాత్ర, అట్టర్ ఫ్లాప్ అవుతుందనుకుంటే.. అది కాస్తా యావరేజ్ నుంచి ఎబౌ యావరేజ్‌కి మారింది. హిట్టు, సూపర్ హిట్టు.. అని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇంకోపక్క, మహానాడు జోరులో వున్నారు టీడీపీ నేతలు. ‘కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్’ అంటూ ప్లకార్డులు కూడా షురూ అయ్యాయ్.

ఈ మహానాడు వేదికగానే నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై టీడీపీలో స్పష్టత వస్తుందని కొందరు టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కానీ, అదే జరిగితే.. టీడీపీ చాలా వేగంగా ఖాళీ అయిపోతుందన్నది ఇంకొందరి వాదన.

పొత్తుల అంశంపై మహానాడు వేదికగా ఎలాంటి ప్రకటనా వుండబోదట. సొంతంగానే అధికారంలోకి వస్తామనే సంకేతాలు మహానాడుతో పంపుతారట. ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేనని కూడా మహానాడులో స్పష్టతనిస్తారట.

కానీ, నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ శ్రేణులకు సందేశాలు వెళ్ళిపోయాయట. ఇదేం రాజకీయమో మరి.!