తప్పు ఒప్పేసుకున్న నారా లోకేష్.!

‘తెలుగు నేర్చుకోకపోవడం తప్పే. తెలుగు భాష అమ్మ లాంటిది. అమ్మని చిన్న చూపు చూడలేం. అలాగే తెలుగు భాషని కూడా. నా విషయంలో తప్పు జరిగింది. అంతా ఇంగ్లీషు చదువే. అందుకే, తెలుగులో మాట్లాడటానికి కష్టపడుతున్నాను. కానీ, నేను చేసిన తప్పు.. నా కొడుకు దేవాన్ష్ విషయంలో జరగకూడదు..’ అంటూ తప్పు ఒప్పేసుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

‘తెలుగు నేర్పించే స్కూల్‌లోనే నా కొడుకుని చదివిస్తున్నాను. వాడు నాలా కాదు, తెలుగులో బాగా మాట్లాడగలగాలి..’ అని నారా లోకేష్ వ్యాఖ్యానించడం అంతటా చర్చనీయాంశమవుతోంది.

నిజానికి, అత్యంత వ్యూహాత్మకంగా పాదయాత్రలో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తెలుగులో మాట్లాడితే, ఒక్కోసారి బూతులు వచ్చేస్తాయ్. అది టీడీపీ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బ తీస్తోంది కూడా.! ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ తెలివిగా తన ‘తెలుగు తప్పు’ని ఒప్పేసుకున్నట్లయ్యింది.

సో, ఇకపై నారా లోకేష్ తెలుగుపై ఎవరన్నా విమర్శలు చేస్తే, అవీ రాజకీయ విమర్శలైతే.. నారా లోకేష్‌కి అడ్వాంటేజ్ అవుతుంది. ‘నేను తెలుగులో సరిగ్గా మాట్లాడలేను..’ అని లోకేష్ స్వయంగా ఒప్పేసుకున్నాడు గనుక.!

బహుశా ఇది, చంద్రబాబు వ్యూహమే అయి వుండాలి. లోకేష్ తెలుగు, టీడీపీ కొంప ముంచేస్తోందని చంద్రబాబుకీ తెలుసు. కానీ, గతంలో ఎప్పుడూ లోకేష్ ఇలా తెలుగు విషయంలో తన తప్పుని ఒప్పుకోలేదు.

తప్పదు.. కాలంతో పాటు మారాల్సిందే.. తెలుగులో ఎంతలా లోకేష్‌కి ట్రెయినింగ్ ఇచ్చినా.. తప్పులు దొర్లుతూనే వుండడంతో.. ఇదిగో, ఇలా తప్పుని ఒప్పేసుకునేలా చేశారన్నమాట.