మంత్రి రోజా వర్సెస్ నారా బ్రహ్మణి… ఘాటు రిప్లై!

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాడ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ పదో రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును బయటకు తేవాలని ఆయన తరుపు న్యాయవాదులు తెగ కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణకు రానున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు అరెస్ట్ అనంతరం వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. విపక్షాలు చేసే విమర్శలకు అధికార వైసీపీ ఘాటుగా తిప్పికొడుతుంది. ఈ సమయంలో నారా బ్రహ్మణి ఒక ట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని, నిబంధనల ప్రకారమే ఒప్పందాలు జరిగాయంటూ సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టం చేశారంటూ ఆ ట్విట్ట్ లో పేర్కొన్నారు.

కాస్త ఆలస్యంగా అయినా ఆ ట్వీట్ పై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఘాటుగా బదులిచ్చారు. చంద్రబాబు అండ్ కో వందలాది కోట్ల రూపాయల మేర ప్రజా ధనాన్ని దోచుకున్నారనేది ఆధారాలతో సహా తేలిందని చెప్పిన రోజా… అయినప్పటికీ ఈ ఆర్థిక మోసాన్ని సమర్థించడానికి బ్రాహ్మణి, ఆమె కుటుంబ సభ్యులు.. ఎల్లో మీడియా ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోన్నారని అన్నారు.

ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమౌతోందని రోజా తెలిపారు. ఇదే క్రమమో సీమెన్స్ కంపెనీతో కలిసి చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డాడని, ఆ కారణంతోనే సుమన్ బోస్‌ ను కంపెనీ యాజమాన్యం విధుల నుంచి తొలగించిందని రోజా తెలిపారు. వైసీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేయడం వల్ల తప్పు ఒప్పయినట్లు కాదని చురకలు అంటించారు.

అనంతరం వందల కోట్ల రూపాయల మేర ప్రజాధనం ఏమైందనే విషయాన్ని నిర్ధారించడంపైనే తమ దృష్టి నిలిచిందని.. నిజాన్ని వెలికి తీయడానికి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికే విచారణ జరుగుతోందని తెలిపారు. ఇదే సమయంలో ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని అన్నారు. దీంతో బ్రాహ్మణి ని రోజా గట్టిగానే తగులుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.