రాత్రి 7 గంటలకు లైట్లు ఆపమంటున్న బ్రాహ్మణి… ఏందమ్మా ఇదీ?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సుమారు నాలుగు వారాలుగా చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మరోపక్క ఆయన బెయిల్ కోసం, స్కిల్ స్కాం కేసు క్వాష్ కోసం ఆయన తరుపు లాయర్లు కుస్తీలు పడుతున్నారు!

ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు అరెస్టు వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నప్పటికీ, టీడీపీ నేతలు మాత్రం ఇప్పటికీ అది అక్రమ అరెస్ట్ అనే మాటలే మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో రకరకాలా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా… మొన్నటికి మొన్న గంటలు వాయించాలని.. ప్లేట్ల మీద దరువు వేయాలని.. అలా చేసి చంద్రబాబు అరెస్టు తప్పన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని పిలుపునివ్వటం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరో టీడీపీ శ్రేణులకు మరో టాస్కును ఇచ్చారు బ్రాహ్మణి. తాజాగా ట్వీట్ లో పిలుపునిచ్చిన ఆమె.. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని అనుకునే కొందరికి.. రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని పేర్కొంటూ దీపాల్ని వెలిగించాలంటూ పిలుపిచ్చారు బ్రాహ్మణి. దీనికి సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేశారు.

అక్టోబరు 7న (శనివారం) రాత్రి 7 గంటల వేళలో ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి.. ఐదు నిమిషాల పాటు దీపాలు.. సెల్ ఫోన్ లైట్లు.. టార్చ్.. కొవ్వొత్తులు వెలిగిద్దామని.. ఒకవేళ రోడ్ల మీద వాహనాలతో ఉంటే లైట్లు బ్లింక్ (ఆన్ – ఆఫ్) చేద్దామని పిలుపునిచ్చారు బ్రాహ్మణి.

“మన రాష్ట్రాన్ని.. మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకోమంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని అనుకుంటున్నారు. కానీ.. రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు.. మనమెందుకు చీకట్లో ఉండాలి” అంటూ పిలుపునిచ్చారు బ్రాహ్మణి.

దీంతో బ్రాహ్మణి ఇచ్చిన పిలుపునకు సంబంధించిన ట్వీట్ చూసినోళ్లంతా మోడీని ఫాలో అవుతున్నట్లుగా భావిస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో.. ప్రజలకు ప్రధాని మోడీ ఏదో ఒక టాస్కును ఇవ్వటం తెలిసిందే. మొదట్లో గంట మోగించాలని.. ఆ తర్వాత లైట్లు ఆపేసి.. దీపాలు వెలిగించాలంటూ వరుస పెట్టి ఇచ్చిన పిలుపులపై విపరీతమైన కామెంట్లు వచ్చాయి.

ఈ నేపథ్యంలో… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు కోసం గంటలు మోగించాలని, ప్లేట్లపై గరెటెలతో శబ్ధం చేయాలని, విజిల్స్ వేయాలని కోరిన బ్రాహ్మణి… ఇప్పుడు లైట్లు ఆపాలని, దీపాలు వెలిగించాలని కోరుతుండటం గమనార్హం.