కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం ఓ వెలుగు వెలిగింది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. తమ అనుచర వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. బీజేపీ మినహా అన్ని పార్టీల్లోనూ ఫిరాయించారనే పేరు ఉన్నప్పటికీ.. జిల్లా రాజకీయాలపై మాత్రం పట్టు పోగొట్టుకోలేదు. తెలుగుదేశం గానీ, కాంగ్రెస్‌లో కొనసాగినా గానీ, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తమ ఆధిపత్యాన్ని నిలుపుకొంటూ వచ్చారు. ఆ ఆధిపత్యానికి గండి పడినట్టే కనిపిస్తోంది. భూమా కుటుంబానికి చాప కింద నీరు తీసుకొస్తోంది కూడా అధికార తెలుగుదేశం పార్టీనే అనేది జిల్లా ప్రజల అభిప్రాయం. నంద్యాలకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎన్ఎండీ ఫరూఖ్‌కు మంత్రివర్గంలోకి తీసుకోవడమే దీనికి పరాకాష్ట అనే ఉదహరిస్తున్నారు కూడా. భూమా అఖిలప్రియ
నంద్యాల ఎమ్మెల్యే, దివంగత భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అఖిలప్రియకు టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ సీపీ. అక్కడి నుంచి ఎన్నికైన అఖిలప్రియ తన తండ్రితో పాటే తెలుగుదేశం తీర్థాన్ని పుచ్చుకున్నారు. కొద్దిరోజులకే నాగిరెడ్డి కూడా గుండెపోటుతో మరణించారు. ఆ తరువాత అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు లభించింది. ప్రస్తుతం ఆమె పర్యాటక మంత్రిగా ఉన్నారు. తండ్రి మరణం ద్వారా ఖాళీ అయిన నంద్యాల స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోగలిగారు.
అది గతం. ఇప్పుడు వారి పరిస్థితేమిటనేది వారికే తెలియట్లేదు. మంత్రిగా ఉన్నా అధికారులపై పెద్దగా ఆజమాయిషీ చేయలేని పరిస్థితి అఖిలప్రియది. పేరుకు మాత్రమే మంత్రి. అంతా ముఖ్యమంత్రే చూసుకుంటారనే అపవాదు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల పాత కాపు ఫరూఖ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పరిస్థితి తలకిందులైంది. అటు అఖిలప్రియకు, ఇటు బ్రహ్మానందరెడ్డికి చేతులు కట్టేసినట్టయింది. తెలుగుదేశం క్షేత్రస్థాయి క్యాడర్ మొత్తం ఇప్పుడు ఫరూఖ్ వెంటే ఉంటోంది. అఖిలప్రియకు గానీ, బ్రహ్మానంద రెడ్డికి గానీ పెద్దగా పట్టించుకోవట్లేదనేది జనం చెబుతున్న మాట. ఈ విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ- పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
చెట్టును మొదళ్ల నుంచీ నరుక్కుంటూ రావాలనే సూత్రాన్ని పాటిస్తోంది తెలుగుదేశం. అందుకే- భూమా కుటుంబానికి వెన్నంటి ఉండే కార్యకర్తలు, అనుచరులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఫరూఖ్‌కు అండగా ఉండాలని సూచిస్తోంది. దీనికి అంగీకరించని అనుచరుల ఇళ్లపై సోదాల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇటీవలే రుద్రవరం మండలానికి చెందిన భూమా కుటుంబ అనుచరులపై పోలీసుల దాడులు చేశారు. ఈ సందర్భంగా అఖిల ప్రియను కూడా వారు లెక్క చేయలేదు. ఆమె వద్దని వారిస్తున్నప్పటికీ.. వినిపించుకోలేదు పోలీసులు. పైనుంచి ఆదేశాలు వచ్చాయంటూ తమ పని తాము చేసుకుపోయారు.
పోలీసుల చర్యకు నిరసనగా అఖిలప్రియ తన గన్‌మెన్లను వెనక్కి పంపించారు. ఈ సంఘటన తరువాత కూడా ప్రభుత్వ పెద్దలు ఆమెను బుజ్జగించిన దాఖలాలు లేవు. దీనితో- బ్రహ్మానందరెడ్డి కూడా గన్‌మెన్లను వద్దని నిరసన తెలిపారు. గన్‌మెన్లను దూరం పెట్టారు. ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వం 2 ప్లస్ 2 విధానంలో భద్రత లభిస్తోంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనడానికి భూమా బ్రహ్మానందరెడ్డి వెళ్తూ, గన్‌మెన్‌లను దూరం పెట్టారు. తన వెంట రావొద్దని సూచించారు. దీనితో పోలీసులు ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీకి రిపోర్ట్ చేశారు. ప్రజా ప్రతినిధులు వద్దని ఆదేశించినప్పటికీ.. విధులను నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉండటంతో, ఎస్పీ ఆదేశాల మేరకు వారు వేరే వాహనంలో ఎమ్మెల్యేను అనుసరించారు.
ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటనలోనూ ఇదే దృశ్యం కనిపించినట్లు చెబుతున్నారు. గన్‌మెన్లను వెనక్కి పంపడంతోపై అఖిలప్రియతో చంద్రబాబు నాయుడు ముక్తసరిగా మాట్లాడారని అంటున్నారు. నంద్యాల టికెట్‌ను స్థానిక లోక్‌సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి కుమారుడికి దాదాపు ఖాయం చేయడం వల్లే అఖిలప్రియను గానీ, బ్రహ్మానందరెడ్డిని గానీ పెద్దగా చంద్రబాబు పెద్దగా పట్టించుకోవట్లేదనేది సమాచారం.