ఈసారి ఎమెల్యేగా నందిగం సురేష్… నియోజకవర్గం ఫిక్స్?

వైఎస్సార్ సీపీలో ఈసారి సీట్ల సర్దుబాటు వ్యవహారం జగన్ కు అతిపెద్ద టాస్క్ గా మారబోతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే చాలా చోట్ల సిట్టింగులపై నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయని.. ఫలితంగా ఈసారి వారికి టిక్కెట్లు డౌటే అని కథనాలొస్తున్నాయి. ఇదే క్రమంలో… కొంతమంది ఎంపీలు కూడా ఈసారి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగాలని భావిస్తున్నారంట. అయితే ఈ కోరికను కొంతమంది నేతలే నేరుగా వ్యక్తం చేస్తుంటే.. మరికొన్ని చోట్ల కేడరే కోరుకోవడం గమనార్హం. ఆ లిస్ట్ లో ప్రస్తుతం నందిగం సురేష పేరు ప్రముఖంగా వినిపిస్తుంది!

వైఎస్ జగన్ అత్యంత ఆత్మీయులుగా భావించే వైసీపీ నేతల్లో నందిగం సురేష్ కూడా ఒకరు. చాలా క్లిష్టపరిస్థితుల్లో.. కష్టకాలంలో.. నందిగం సురేష్ తనకోసం చాలా బలంగా నిలబడ్డారని జగన్ నమ్ముతుంటారు.. ఫలితంగా గడిచిన ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీ సీటు ఇచ్చారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సురేష్ కి ఒక ఆఫర్ వస్తుందంట. ఆ నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు అంతా కలిసి… సురేష్ కు ఒక రిక్వస్ట్ పెట్టుకున్నారంట.

అవును… రాబోయే ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని నందిగం సురేష్ కు ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు ఆఫర్ చేశారని తెలుస్తుంది. అందుకు కారణం… ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు పై పార్టీ కేడర్ లో వ్యతిరేత రోజు రోజుకీ పెరిగిపోతుందని అంటున్నారు. మొదట్లో ఈయన వ్యవహారశైలి కాస్త బాగానే ఉన్నా.. ఆ తర్వాత అధికారుల బదిలీలు, పనుల కేటాయింపుల్లో పారదర్శకత లేకపోవడం, ఒంటెద్దు పోకడలకు పోవడం వంటి కారణాలతో ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు గ్యాప్ పెరిగిందని తెలుస్తుంది.

దీంతో… చీమకుర్తి మినహా మిగిలిన అన్ని మండలాల్లోని ద్వితీయ శ్రేణి నేతలు.. ఎమ్మెల్యే తీరు నచ్చక కులాల వారీగా గ్రూపులు కట్టారట! దీంతో ఈసారి ఆయనకు సీటు ఇచ్చినా కూడా గెలుపు డౌటేనని అంటున్నారు స్థానిక జనాలు. దీనికి తోడు… “అవినీతి ఎమ్మెల్యే మాకొద్దు.. కొత్త సమన్వయకర్త ముద్దు” అంటూ సుధాకర్‌ బాబుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు వేసేవరకూ వచ్చింది వ్యవహారం. దీంతో… స్థానిక ఎస్సీ నేతలు ఇటీవల బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ని కలిసి.. సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తే తమ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారట. ఫలితంగా… కార్యకర్తలే ఇలా ఆఫర్ చేయడంతో… వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేయటానికి సురేష్ ఆసక్తిగా ఉన్నారని ప్రచారం మొదలైపోయింది.

మరి కార్యకర్తల అభిప్రాయలను అధిష్టాణం ఎలా తీసుకుంటుంది? సుధాకర్ బాబుకు మరో ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తుందా? లేక, సురేష్ ను అసెంబ్లీకి తీసుకెళ్తుందా అన్నది వేచి చూడాలి!