నాదెండ్ల మనోహర్ త్యాగం చెయ్యక తప్పదా.?

టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు చర్చల సందర్భంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేయాలనుకుంటున్న తెనాలి నియోజకవర్గం విషయమై ఎటూ తేలడంలేదట.! ఈ విషయమై మీడియా, రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాదెండ్ల మనోహర్‌ని ఎమ్మెల్సీని చేద్దామనీ.. కుదిరితే రాజ్యసభకి పంపుదామనీ.. ఇలా పలు ప్రతిపాదనల్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుంచినట్లు తెలుస్తోంది.

అయితే, నాదెండ్ల మనోహర్‌కి సీటు ఖాయం చేయడం ద్వారా, పార్టీ శ్రేణులకు సరైన సంకేతం పంపడానికి అవకాశం దొరుకుతుందనీ, ఈ విషయంలో తాను వెనక్కి తగ్గలేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో తెగేసి చెప్పారన్నది ఇంకో వాదన.

కాగా, పొత్తుల్లో భాగంగా త్యాగం చెయ్యాల్సి వస్తే, తాను ముందుంటానని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి చెప్పేశారట. తెనాలి నుంచి పోటీ చేయాలన్నదే తన అభిమతమనీ, అయితే.. పొత్తుల సందర్భంగా త్యాగాలు తప్పకపోవచ్చని, తానే త్యాగం చేస్తే, పార్టీ క్యాడర్‌కి మంచి సంకేతాలు వెళతాయనీ నాదెండ్ల మనోహర్ అంటున్నారట.

అయితే, ఈ మొత్తం వ్యవహారంపై అటు జనసేన శ్రేణులుగానీ, ఇటు టీడీపీ శ్రేణులుగానీ పెదవి విప్పడంలేదు. ఎక్కువ సీట్లు.. ఖచ్చితంగా గెలిచే అవకాశమున్న సీట్లు.. ఈ రెండు అంశాలపైనే జనసేన పార్టీలో అంతర్మధనం జరుగుతోంది.

మెజార్టీ జనసేన ఆశావహులు, అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే శిరోధార్యం అంటున్నారట. వాళ్ళందర్నీ నాదెండ్ల మనోహర్ స్వయంగా డీల్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కూడా వారి నుంచి పలు పలు విధాలుగా అభిప్రాయాలు సేకరిస్తూనే వున్నారు.

‘నేను లోక్ సభకి కూడా పోటీ చేయాల్సి వస్తే..’ అన్న విషయమ్మీద కూడా జనసేనాని, జనసేన ముఖ్య నేతల నుంచి తాజాగా ఇంకోసారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.