విషాదం: తిరిగి రాని లోకాలకు తారకరత్న!

టాలీవుడ్ యువనటుడు నందమూరి తారకరత్న కన్ను మూశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజు.. ఉన్నపలంగా కిందపడిపోయిన తారకరత్నను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా గుండెపోటుతో మూడు వారాల క్రితం బెంగళూరు నారాయణ ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

గత 23 రోజులుగా ఆసుపత్రి లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య వస్తోన్న హెల్త్ బులిటెన్స్ లో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడం.. దాంతో విదేశీ డాక్టర్లతో చికిత్స చేయించడం జరిగింది. అయినా కూడా తారకరత్న ప్రాణాన్ని నిలబెట్టలేక పోయారు.

నందమూరి తారకరామారావు మనవడుగా తారకరత్న కేవలం పందొమ్మిదేళ్ళకే “ఒకటో నెంబర్ కుర్రాడు” గా కెమెరా ముందుకు వచ్చారు. అది కూడా ఒకేసారి తొమ్మిది సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది నాటికీ నేటికీ కూడా రికార్డు బ్రేకింగే.

అలా మొదలైన కెరీర్… ఆశించిన స్థాయిలో సాగలేదనే చెప్పాలి. ఇక, రాజకీయాలపై ఆసక్తి ఉన్న తారకరత్న… వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఈలోపే తారకరత్నను విధి చిన్న చూపు చూసింది!

ఏది ఏమైనా మంచి మర్యాదలలో చక్కని వ్యక్తిత్వం కలిగిన నందమూరి తారకరత్న చిన్న వయసులోనే కన్నుమూయడం బాధాకరం. ఈ సందర్భంగా… నందమూరి కుటుంబ సభ్యులకు, నందమూరి అభిమానులకు ప్రగాడసానుభూతిని తెలియజేస్తుంది.. తెలుగురాజ్యం.కాం.