చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దైన్యమైన స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజాధరణే కాదు చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం కూడ టీడీపీని పట్టిపీడిస్తోంది. గత ఎన్నికల్లో టికెట్లు పొంది, ఓడిపోయిన చాలామంది నేతలు పార్టీని సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఓడిపోయామని బాధో లేకపోతె గెలవలేమనే అనాసక్తో తెలీదుకానీ పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో విఫలమవుతున్నారు. వారిలో నల్లారి కిషోర్ కుమార్ కూడ ఒకరు. ఈయన స్వయానా మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగారికి తమ్ముడు. 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టగా ఆ పార్టీ నుండి పీలేరులో పోటీచేసి ఓడిపోయారు. దాంతో సైలెంట్ అయిపోయి కొన్నాళ్ల తర్వాత టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు మాజీ సీఎం తమ్ముడనే ఉద్దేశ్యంతో ఆయన్ను ఆదరించి టికెట్ ఇచ్చారు.
ఆ ఎన్నికల్లో కూడ ఆయన ఓటమిపాలయ్యారు. ఇలా వరుసగా రెండుసార్లు ఓడిపోవడంతో కిషోర్ కుమార్ రెడ్డికి అసహనం ఎక్కువైనట్టుంది. అందుకే నియోజకవర్గంలో పార్టీని పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప నిత్యం క్రియాశీలకంగా లేరు. గత కొన్ని నెలలుగా వినిపించని ఆయన పేరు ఈమధ్య వైసీపీ శ్రేణులతో జరిగిన ఘర్షణ కారణంగా తెరపైకి వచ్చింది కానీ జనం ఆయన పేరు విని చాలారోజులు అయింది. పీలేరులో తెలుగుదేశం ఓడిపోయి ఉండవచ్చు కానీ మంచి కేడర్ కలిగి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద, జగన్ హవాలో 7800 ఓట్ల తేడాతోనే ఆయన ఓడారు. అది మరీ అంత దారుణమైన ఓటమి అయితే కాదు. పైపెచ్చు వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఎన్నికల సమయానికి ప్రభుత్వం మీద ఎంతో కొంత ప్రజావ్యతిరేకత కామన్.
తెలివైన లీడర్ ఎవరైనా దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు. అధికార పార్టీలోని లోపాలను, వైఫల్యాలను భూతద్దంలో వెతికి మరీ పట్టుకుని జనం ముందు నిలబెడతారు. అవే వారిని జనంలోకి తీసుకెళతాయి. పైగా అక్కడి వైసీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయట. ఒకటి ఎమ్మెల్యే వర్గం కాదా ఇంకొకటి ఎంపీ వర్గం. ప్రతిచోటా వీరి మధ్య పోటీ, పంతం పొడచూస్తున్నాయి. ప్రజలకు సైతం ఈ వర్గపోరు తలనొప్పిగా మారుతోందట. నియోజకవర్గంలో ఒక్క పనీ సక్రమంగా జరగట్లేదని అసంతృప్తితో ఉన్నారట. దీన్నే తన మీద సానుభూతిగా మార్చుకోవాలి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. కానీ ఆ పని చెయ్యట్లేదు. ఎన్నికలు వచ్చాక చూసుకుందాంలే అన్నట్టు ఉన్నారు. ఇలాగే ఇంకొన్నాళ్ళు నడిస్తే పీలేరులో టీడీపీ జెండా మోసేవారు శ్రేణులు కూడ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇదే చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించింది.