అలాగనే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. బహుశా నల్లారి వారు ఇపుడే నిద్రలేచినట్లుంది చూడబోతే. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఈయనగారికి అర్ధం కావటం లేదట. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించటం లేదని కూడా అనేశారు. విభజన హామీల అములో నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని కూడా మండిపడ్డారు లేండి. తెలంగాణాలో దారుణంగా ఫెయిలైన మహాకూటమిలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబును కూడా అంతమాటనేశారు కిరణ్. తెలంగాణా ఎన్నికల ఫలితాల తర్వాత ఏపిలో కాంగ్రెస్- చంద్రబాబు మధ్య ఏదో తేడా కొట్టేట్లుగానే ఉంది చూస్తుంటే.
సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి వారు చివరి నిముషం వరకూ రాష్ట్ర విభజన జరగదనే జనాలను తప్పుదోవ పట్టించారు. రాష్ట్ర విభజన తప్పదని ఒకవైపు స్పష్టమైన సంకేతాల కనబడుతున్నా సిఎంగా ఉన్నారు కాబట్టి కిరణ్ ఏమైనా చేస్తారేమో అన్న భ్రమల్లో ఉంచారందరినీ. చివరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి జై సమైక్య పార్టీ అనే చెప్పుల పార్టీని పెట్టారు లేండి. పార్టీ తరపున ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్ధుల్లో నల్లారి వారి సోదరునికి తప్ప ఇంకెవరికీ డిపాజిట్ కూడా రాలేదు.
అంతటి ఘన చరిత్ర కలిగిన నల్లారి వారు ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరారు. చేరీ చేరంగానే జగన్ పై విమర్శలు మొదలుపెట్టేశారు. గడచిన నాలుగున్నరేళ్ళుగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన విధానంపై కిరణ్ కు అవగాహన లేనట్లుంది. ఫిరాయింపులు, అసెంబ్లీలో టిడిపి అవలంభిస్తున్న వైఖరి తదితర కారణాల వల్లే వైసిసి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందన్న విషయం అందరికీ తెలిసినా కిరణ్ కు మాత్రం తెలీలేదు. విభజన హామీల అమలులో మోడి, చంద్రబాబులు విఫలమయ్యారని కిరణ్ కు ఇఫుడే తెలిసినట్లుంది.
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదని చెప్పటం కిరణ్ కే చెల్లింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశం సజీవంగా ఉందంటే అందుకు కారణం జగనే. రైతు సమస్యల మీద జగన్ చేసిన నిరాహారదీక్షలు బహుశా కిరణ్ చూడలేదేమో ? విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణం తదితర అంశాలపై వైసిపి ఎన్ని ఆందోళనలు, నిరశనలు చేసినా కిరణ్ దృష్టిలో పడలేదేమో ? మొత్తానికి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్లుంది కిరణ్ వ్యవహారం. హోలు మొత్తం మీద కిరణ్ చెప్పేదేమంటే కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపికి ప్రత్యేకహోదా వస్తుందట. అది ఇఫ్పట్లో జరిగేపనేనా ?