నష్టనివారణ చర్యల్లో టీడీపీ… పవన్ కు బిగ్ షాక్!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. జన్సేనతో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ పవన్ కు భారీ షాక్ ఇచ్చింది. అయితే ఇది పవన్ కు ఇస్తున్న బిగ్ షాక్ అని అభివర్ణించడం కంటే… చంద్రబాబు నోటి తీటవల్ల కలగబోయే నష్టాన్ని తగ్గించే ప్రక్రియలో భాగమంటే బెటర్ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో కొద్ది రోజులుగా వాలంటీర్ వ్యవస్థ పై పవన్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడే రాష్ట్రంలో ఉమన్ ట్రాఫికింగ్ కి వాలంటీర్లు సహకరిస్తున్నారని అంటూనే… అబ్బే నా ఉద్దేశ్యం అది కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరోసారి వాలంటీర్ల వ్యవహ్సథ అవసరం లేదు అని అంటారు. వెంటనే అందరినీ అనలేదు అని సవరదీస్తుంటారు.

వెనువెంటనే వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఏమి నష్టం జరిగిపోద్ది అంటూ కోర్టుకు వెళ్తామని చెబుతుంటారు. ఈ సమయంలో చంద్రబాబు కూడా.. చెప్పు ఇచ్చుకుని కొట్టేవాళ్లు లేక వాలంటీర్లు చెలరేగిపోతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో… చంద్రబాబు కు వచ్చే ఎన్నికల్లో అదిచ్చుకుని కొట్టడం పక్కా అనే కామెంట్లు వినిపించడం మొదలయ్యాయి.

దీంతో అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు వాలంటీర్ల విషయంలో విజ్ఞత మరిచి, సంస్కారం విడిచి మాట్లాడుతున్నారంటూ విమర్శలు పెరిగిపోతున్నాయి. రోడ్లపై దిష్టిబొమ్మలు దహనం చేయడం, ఫోటోలను చెప్పులు తీసుకుని కొట్టడంతోపాటు.. పలు పోలీస్ స్టేషన్ లలో ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో… టీడీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. పరోక్షంగా పవన్ కు షాకిచ్చింది.

అవును… తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అభిప్రాయాన్ని చెప్పే పనికి పూనుకున్నారు ఆ పార్టీ నేత నక్కా ఆనందబాబు. టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజల కోసం సమర్థవంతంగా, సక్రమంగా పని చేసేలా వాలంటీర్లను తీర్చిదిద్దుతామని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆనందబాబు చెబుతున్నారు. పని ఒత్తిడి లేకుండా ప్రజలకు జవాబు దారీగా, బాధ్యతాయుతంగా సేవలందించే నూతన వ్యవస్థగా మారుస్తామని వివరించారు.

దే సమయంలో వలంటీర్, సచివాలయ వ్యవస్థను టీడీపీ రద్దు చేస్తుందనడం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పిన ఆయన… ఆ వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను, కొందరు వాలంటీర్ల హద్దులు మీరిన ప్రవర్తననే తాము తప్పు పడుతున్నామని వివరించారు. అంతేతప్ప వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఉద్దేశ్యం టీడీపీకి లేదని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.

కాగా… వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని, ఈ విషయంపై కోర్టుకి వెళ్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! దీంతో పవన్ ను టీడీపీ నేతలు వెన్నుపోటు పొడిచారని అనుకోవాలా.. లేక, ప్రజల దగ్గర డబుల్ గేంస్ ఆడుతున్నారని అనుకోవాలా.. అదీ గాకపోతే బాబు వ్యాఖ్యలకు ప్రజలు మాడు పగలగొడతారనే భయంతో నష్టనివారణ చర్యలకు దిగుతున్నారని భావించాలా అని అంటున్నారు పరిశీలకులు.