మరీ ఇంత బరితెగింపా ?

రాజ్యసభలో బలం పెంచుకునేందుకు బిజెపి మరీ ఇంతలా బరితెగిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం, ఒత్తిళ్ళకు గురిచేసి ప్రజా ప్రతినిధులను లాక్కోవటం అధికారంలో ఉన్న పార్టీలకు చాలా సహజమైపోయింది. అంటే ఇందుకు వైసిపి మినహాయింపనుకోండి అది వేరే సంగతి.

తాజాగా టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బిజెపిలో చేరారు. విచిత్రమేమిటంటే పార్టీలో చేరిన సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లను స్వయంగా బిజెపి వర్కింప్ ప్రెసిడెంట్ జేపి నడ్డాయే రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గరకు తీసుకెళ్ళటం.

తాము టిడిపికి రాజీనామా చేస్తున్నామని, తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని పై నలుగురు ఎంపిలు సంతకాలు చేసి విజ్ఞప్తిని వెంకయ్యకు అందించారు. ఆ సమయంలో నడ్డాయే వారిని వెంకయ్య దగ్గరకు తీసుకెళ్ళి దగ్గరుండి లేఖను ఇప్పించారు. అంటే ఎవరేమనుకున్నా లెక్క చేయాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి బిజెపి అగ్ర నాయకత్వం వచ్చేసినట్లే అర్ధమైపోతోంది.

బిజెపిలో విలువలన్నవి బహుశా వాజ్ పేయ్, ఎల్ కె అద్వానీ శకంతోనే అంతమైపోయినట్లుంది. ఇపుడున్న నాయకత్వం లక్ష్యాన్ని చేరుకోవటానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకానీ లక్ష్యాన్ని చేరుకునే మార్గం ఏమిటి అన్న విషయాన్ని గాలికొదిలేసింది. చూస్తుంటే బిజెపి బాగా బరితెగించేసిందని మాత్రం అర్ధమైపోతోంది.