దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చిన పార్టీగా టీడీపీ చరిత్ర గొప్పది. సంక్షేమ పాలనలో కొత్త పుంతలు తొక్కిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అందించిన సేవలు మరువలేనివి. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ దిశలో అడుగులు వేస్తూ, లోకేశ్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.
అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లు పథకం దేశవ్యాప్తంగా ప్రేరణగా నిలిచింది. రూ.5కే భోజనం అందిస్తూ పేద ప్రజల కడుపు నింపిన ఈ పథకం పలు రాష్ట్రాల్లో అనుసరించబడింది. చాలా రాష్ట్రాలు ఈ పథకానికి ఆధారంగా తమ తమ క్యాంటీన్లను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం కొనసాగుతోంది. ప్రజలకు తక్కువ ధరలో రుచికరమైన ఆహారం అందించడంలో టీడీపీ ముందుంది.
ఇప్పుడు ఆ పథకాన్నే ఆధారంగా తీసుకుని, బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అటల్ క్యాంటీన్ల పథకాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఈ క్యాంటీన్లను ప్రారంభించి రూ.5కే భోజనం అందించనున్నట్లు చెప్పారు. ఇది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం ఈ పేరును పొందింది. టీడీపీ అలోచనలను బీజేపీ అమలు చేస్తుండటం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అటల్ క్యాంటీన్లతో పాటు బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అంశాలు కూడా టీడీపీ పథకాలను పోలి ఉండటం గమనార్హం. సంక్షేమం ద్వారా ప్రజల మనసు గెలవాలనే ఆలోచన టీడీపీ ద్వారా దేశానికి వచ్చినట్లు చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే, బీజేపీ తమ మేనిఫెస్టోలో టీడీపీ పథకాల స్ఫూర్తితో ముందుకు వెళ్తూ, ప్రజల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఢిల్లీలో ఈసారి భాజపా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.