అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ళలో మొట్టమొదటిసారిగా అధికార పార్టీ ఎంఎల్ఏపై చంద్రబాబునాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో వివాదాలకు కారణమవుతున్నాడన్న ఆరోపణలపై ఎంఎల్ఏ మేడా మల్లి కార్జునరెడ్డిని చంద్రబాబు సస్పెండ్ చేయటం గమనార్హం. నిజానికి చాలా నియోజకవర్గాల్లో రాజంపేటలో ఉన్న గొడవలకన్నా ఎక్కువ వివాదలే నడుస్తున్నాయి. గొడవలు పడుతున్నారన్న కారణంతో కనీసం ఒక్క మండల స్ధాయి నేతపైన కూడా చంద్రబాబు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అటువంటిది అర్జంటుగా మేడాపైన మాత్రమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?
ఏమొచ్చిందంటే, మేడా వైసిపిలో చేరుతున్నారన్న సమాచారం ఉండబట్టే. మంగళవారం సాయంత్రం మేడా వైసిపిలో చేరారు. అంటే అంతకుముందే చంద్రబాబు ఎంఎల్ఏను సస్పెండ్ చేశారు. మేడా పార్టీ మారుతారనే ప్రచారం ఇఫ్పటిదికాదు. అందుకనే ఒక పథకం ప్రకారం మేడాకు టిడిపిలో పొగపెట్టారు. ఆ విషయాన్ని మేడానే స్వయంగా చెప్పారు. పార్టీలో జరిగే కార్యక్రమాలకు, సమావేశాలకు మేడాను పిలవటం మానేసింది టిడిపి. చివరకు ఎంఎల్ఏకి చెప్పకుండానే కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే రాజంపేట నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించారు.
ఒకవైపు పార్టీలో ఇబ్బందులు పెడుతూనే మరోవైపు రాబోయే ఎన్నికల్లో మేడాకు టిక్కెట్టు రాదనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎంఎల్ఏకు ప్రత్యామ్నాయంగా ఎంఎల్సీ బత్యాల చెంగల్రాయలు లాంటి నేతలను ప్రోత్సహించటం మొదలుపెట్టారు. ఇదంతా తెరవెనుక నుండి చంద్రబాబునాయుడు డైరెక్షన్ లో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డే చేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనించిన మేడా టిడిపిలో కొనసాగటం కష్టమని అర్ధం చేసుకున్నారు. ఒక పద్దతి ప్రకారమే మంగళవారం రాజంపేట పంచాయితీ చంద్రబాబు చేపట్టారు. విషయం గ్రహించిన ఎంఎల్ఏ సహజంగానే సమీక్షకు హాజరుకాలేదు. దాంతో నియోజకవర్గంలో వివాదాలకు కారణమవుతున్నారన్న కారణంతో ఎంఎల్ఏపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఎంఎల్ఏ సస్పెన్ష్ కు నియోజకవర్గంలో గొడవలే కారణమైతే చాలామందినే సస్పెండ్ చేయాలి. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, నల్గొండ, ఆళ్ళగడ్డ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం, కదిరి, తాడిపత్రి, కాకినాడు రూరల్, పెద్దాపురం, పాయకరావుపేట లాంటి అనేక నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రోడ్డున పడి కొట్టేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పై నియోజకవర్గాల్లో ఒక్కరంటే ఒక్కరిపైన కూడా చంద్రబాబు చర్యలు తీసుకోలేదు. అలాంటిది మేడాపైన మాత్రమే సస్పెన్షన్ వేటు వేశారంటే కేవలం పరువు కాపాడుకోవటానికి మాత్రమే అని అర్ధమైపోతోంది. ప్రతిపక్షం నుండి 22 మంది ఎంఎల్ఏలను లాక్కున్నపుడు అధికార పార్టీలో నుండి వైసిపిలోకి ఎంఎల్ఏ రివర్సులో వెళ్ళటమంటే నిజంగా చంద్రబాబుకు పరువు తక్కువే కదా ?