టిడిపి ఆఫీసులో జగన్ ఫొటో

వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా ? వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేసిన సూచన అలాగే ఉంది. అనైతిక రాజకీయాలకు పాల్పడనంటూ నిండు సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన తర్వాత దాడి పై విధంగా చంద్రబాబునాయుడుకు సూచన చేయటం గమనార్హం.

ఐదేళ్ళ అధికారంలో చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలకు ఎన్నిసార్లు పాల్పడింది అందరూ చూసిందే.  జగన్ ను అసెంబ్లీలో పూర్తిగా దెబ్బకొట్టాలని ప్రయత్నించారు. జగన్ కు అసెంబ్లీ లో ప్రతిపక్షహోదానే లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలే చేశారు. అందులో భాగంగానే 23 మంది ఎంఎల్ఏల వరకూ లాక్కోగలిగారు. తర్వాత వైసిపి నుండి టిడిపి వైపు ఎవరూ రాకపోయేసరికి చంద్రబాబు కోరిక నెరవేరలేదు.

సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది. ముక్కి మూలిగి 23 సీట్లను మాత్రం గెలుచుకుంది. 175 సీట్లున్న  అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 17 సీట్లుండాలి. టిడిపి గెలిచిన 23 సీట్లలో ఓ పదిమంది ఎంఎల్ఏలను లాగేస్తే చాలు చంద్రబాబు పని గోవిందా . పైగా టిడిపి నుండి వైసిపిలోకి వచ్చేందుకు కొందరు ఎంఎల్ఏలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాలన్నింటినీ జగనే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. అలా చెబుతునే చంద్రబాబు చేసినట్లు నీచపు రాజకీయాలు చేయనని హామీ ఇచ్చారు. ఒకవేళ ఎవరినైనా చేర్చుకోవాలని అనుకుంటే వారితో రాజీనామాలు చేయించిన తర్వాతే వైసిపిలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ విషయాన్నే దాడి గుర్తుచేస్తు జగన్ ఫొటోను  టిడిపి ఆఫీసులో పెట్టుకోవాలంటూ  చంద్రబాబుకు దాడి సూచించటం వైరల్ గా మారింది.