శుక్రవారం జరిగిన తెలుగుదేశంపార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో నేతల్లో చాలామంది చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారు. మొన్నటి ఘోర ఓటమికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణమంటూ ఆరోపించటంతో పెద్ద షాక్ తగిలినట్లైంది. ఓటమిపై విశ్లేషించేందుకు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో పాటు సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం పెట్టారు లేండి.
ముందు చంద్రబాబు మాట్లాడుతూ మొన్నటి ఘోర ఓటమికి కారణాలు తెలియటం లేదంటూ చెప్పారు. అంటే తన తర్వాత మాట్లాడదలుచుకున్న నేతలకు ఎలా మాట్లాడాలో హింట్ ఇచ్చారు. అయితే ఆ హింట్ ను నేతల్లో చాలామంది పట్టించుకోలేదు. ఇపుడు కూడా కారణాలను చెప్పకపోతే ఆత్మవంచన చేసుకున్నట్లే అవుతుందని అనుకున్నారు. అందుకే ఒక్కొక్కరు తమ మనసులోని మాటలును బయటకు కక్కేశారు.
ముందుగా కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ప్రతీ రోజు వేలాది మందిత టెలికాన్ఫరెన్స్ లో గంటల తరబడి మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ఒకేసారి వేలమందితో మాట్లాడటం వల్ల ఎవరైనా ఏమన్నా చెప్పదలచుకుంటే కుదరేది కాదన్నారు. పార్టీలో మానవీయ కోణం దెబ్బతిందని, జన్మభూమి కమిటీలు జనాలను బాగా ఇబ్బందులు పెట్టినట్లు ఎంఎల్సీ జూపూడి ప్రభాకర్ చెప్పారు.
రియల్ టైం గవర్నన్సె అంటూ అధికారులు చెప్పిన కథలు నమ్మటమే కొంప ముంచిందని మరో నేతన్నారు. కోడెల కుటుంబ సభ్యుల అరాచకాలు, అవినీతి కూడా పార్టీ ఓటమికి కారణాలుగా దివ్యవాణి చెప్పారు. పార్టీ ఓటమికి నేతలు చాలా కారణాలనే చెప్పటంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు.