అవును కడప జిల్లాలో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డికి చంద్రబాబునాయుడు షకిచ్చారట. రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీలో పోటీ చేయబోయేది ఎంఎల్సీ రామసుబ్బారెడ్డే అంటూ తేల్చి చెప్పేశారట. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీలో ఎవరు పోటీ చేయాలనే విషయంలో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి మధ్య చాలా కాలంగా పెద్ద వివాదమే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరిలో జమ్మలమడుగులో పోటీ చేయబోయేదెవరో తేలితే రెండో నేత కడప ఎంపిగా పోటీ చేయటం ఖాయమవుతుంది. అందుకనే ముందుగా అసెంబ్లీ నియోజకవర్గం విషయాన్ని తేల్చేందుకు చంద్రబాబు వీరిద్దరితో ఎన్నిసార్లు భేటీలు జరిపినా ఉపయోగం లేకపోయింది.
విచిత్రమేమిటంటే, మీ ఇద్దరిలోనే విషయాన్ని తేల్చుకోండని చంద్రబాబు చెబితే వారు తేల్చుకోరు. పోనీ చంద్రబాబు చెప్పిన మాట వింటారా అంటే అదీ వినరు. మళ్ళీ పైకి మాత్రం చంద్రబాబు ఎంత చెబితే అంతే అంటూ ఇద్దరు పెద్ద బిల్డప్ లు ఇస్తుంటారు. దాదాపు ఏడాదిగా ఈ పంచాయితీలతోనే సరిపోయింది. చివరికి చంద్రబాబు లెక్కలేంటో బయటకు తెలీదు కానీ జమ్మలమడుగు అసెంబ్లీకి రామసుబ్బారెడ్డి పోటీ చేసేట్లు కడప ఎంపిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేసేట్లు చంద్రబాబు ఫైనల్ చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి.
ఎప్పుడైతే చంద్రబాబు ఫైనల్ చేసిన విషయం బయటకు పొక్కిందో ఫిరాయింపు మంత్రి డీలా పడిపోయారట. నిజానికి ఇద్దరికీ కడప ఎంపిగా పోటీ చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకేంట, కడప ఎంపిగా గెలిచేంత సీన్ తెలుగుదేశంపార్టీకి లేదన్న విషయం తెలిసిందే. అందుకనే ఓడిపోయే సీటులో పోటీ చేయటానికి ఇద్దరూ వెనకాడుతున్నారు. పోనీ జమ్మలమడుగులో టిడిపి గెలుపు గ్యారెంటీనా అంటే అదీ చెప్పలేం. అయినా ఇద్దరూ ఈ సీటుకే ఎందుకు పోటీ పడుతున్నారు ?
ఎందుకంటే, ఇద్దరిదీ ఇదే నియోజకవర్గం కాబట్టి. వాళ్ళిద్దరి మధ్య తీవ్రంగా వర్గపోరు నడుస్తోంది కాబట్టి. రేపటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయం కన్నా టిడిపి తరపున ఎవరు పోటీ చేయబోతున్నారు అన్నదే ప్రిస్టేజయిపోయింది. అంటే రేపటి ఎన్నికల్లో గెలవటం కన్నా టిడిపి తరపున పోటీ చేయటమే ఇంపార్టెంట్ అయిపోయింది వీరిద్దరికి. అందుకనే అంత స్ధాయిలో పోరాడారు. చంద్రబాబు విషయం తేల్చేశారు కాబట్టి ఇక ఫిరాయింపు మంత్రేం చేస్తారో చూడాల్సిందే.