ఎంఎల్సీ రాజీనామా…చంద్రబాబుకు షాక్

చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఇంత హఠాత్తుగా సతీష్ పార్టీకి, ఎంఎల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేశారన్న విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. సతీష్ రాజీనామా విషయం తెలుసుకున్న చంద్రబాబు నిజంగానే షాక్ కు గురయ్యారు.

గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం నుండి సతీష్ 2014, 2019 లో రెండుసార్లు ఎంఎల్ఏగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఓడిపోయిన తర్వాత సతీష్ కు చంద్రబాబు ఎంఎల్సీగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కు కూడా సతీష్ బాగా సన్నిహితుడనే చెప్పాలి.

చాలామంది ప్రజా ప్రతినిధులలాగే సతీష్ కూడా బాగానే డబ్బులు సంపాదించాడని పార్టీలోనే ప్రచారంలో ఉంది. ఓడిపోయినా పిలిచి మరీ ఎంఎల్సీని చేసిన తర్వాత కూడా ఇపుడు ఎందుకు రాజీనామా చేశారో అర్ధం కావటం లేదు. పైగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంఎల్సీగా కంటిన్యు అవటానికి మనసు ఒప్పుకోవటం లేదనే విచిత్రమైన కారణాన్ని చెప్పారు.

తాజాగా రాజీనామా చేసిన అన్నం ఈమధ్యనే బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరికి బాగా సన్నిహితుడు. దాంతో అందరికీ అనుమానం మొదలైంది. అన్నం రాజీనామా వెనుక సుజనా ప్రోదల్బమే ఉందంటున్నారు. అదే నిజమైతే తొందరలోనే బిజెపిలో చేరే అవకాశాలును కొట్టిపారేసేందుకు లేదు. ఏదేమైనా అన్నం రాజీనామా చంద్రబాబుకు షాకనే చెప్పాలి.