కాంగ్రెస్, టిడిపి పొత్తు..మంత్రులిద్దరికీ షాక్

తన మంత్రివర్గంలోని ఇద్దరు సీనియర్ సహచరులకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. కాంగ్రెస్ తో పొత్తును సీనియర్ మంత్రలు కెఇ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా వారి అభిప్రాయాన్ని కాదని చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నారు. మరి అప్పట్లో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన మంత్రులిద్దరు ఏమి  చేస్తారో చూడాలి. ఏకపక్షంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం ద్వారా తెలుగుదేశంపార్టీలోని చాలామంది నేతలకు షాకిచ్చినట్లైంది.

ఎందుకంటే, పలువురు నేతలకు చంద్రబాబు చేసిన పని ఏమాత్రం రుచించటం లేదు.  కాంగ్రెస్ పార్టీతో పొత్తుల విషయంలో చంద్రబాబు నేతల అభిప్రాయాలను పెద్దగా సేకరించింది లేదని సమాచారం. కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో సీనియర్ నేతల మనోభావాలు ఎలా ఉంటాయో గ్రహించటం వల్లే మంత్రుల అభిప్రాయాలను తీసుకోలేదు.  అయినా కానీ జరుగుతున్న పరిణామాలను గ్రహించిన పై ఇద్దరు మంత్రులు పొత్తులను బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకించారు.  ఇద్దరు కూడా మీడియాలో చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు.   కెఇ మాట్లాడుతూ చంద్రబాబు గనుక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకుంటానన్నారు.

అదే విధంగా చింతకాయల మాట్లాడుతూ, కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే జనాలు తమను బట్టలూడిదీసి తంతారు అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అప్పట్లో సంచలనం సృష్టించాయి. టిడిపి పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకంగా అయినపుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సమస్యే లేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు తనొక్కడిదే కాదని చాలామంది నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. ఇద్దరు మంత్రుల ఘాటు వ్యాఖ్యలతో చంద్రబాబుకు పెద్ద షాకే తగిలినట్లైంది. దాంతో ఇద్దరితోను విడివిడిగా మాట్లాడి పెద్ద క్లాసే పీకారు.

సరే అదంతా చరిత్రయిపోయింది. కానీ అప్పట్లో వారిద్దరికీ ఏదో సర్దిచెప్పిన చంద్రబాబు చివరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దాంతో మంత్రులతో పాటు చాలా మంది సీనియర్ నేతలు చంద్రబాబుపై మండిపోతున్నారు. ఎన్టీయార్ అభిమానులన్నవారు ఎవరు కూడా చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటాన్ని జీర్ణించుకోలేకున్నారు. కానీ ఇప్పటికిప్పుడు చంద్రబాబు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక అలాగని సర్దుకుని పోలేక అవస్తలు పడుడతున్నారు. చూడబోతే కాంగ్రెస్ తో పొత్తు నిర్ణయమే చంద్రబాబు కొంపముంచేట్లు కనబడుతోంది.