వైసిపి సైకో పార్టీనా ?..జగన్ శాడిస్టంటున్న చంద్రబాబు

చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానాలు వస్తున్నాయి. పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ, వైసిపి ఒక సైకో పార్టీలాగ మారిపోయిందన్నారు. ఇంతకీ వైసిపిని చంద్రబాబు ఎందుకంత మాటన్నారు ? ఎందుకంటే, పరిశ్రమలను అడ్డుకుంటు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారట. నిజంగా చంద్రబాబు మాటలు వింటుంటే పిచ్చెక్కటం ఖాయం. ఒకవైపేమో  రూ. 15 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు కుదిరిందని చెబుతారు. ఇంకోవైపేమో తనను చూసే ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టటానికి క్యూ కడుతున్నారంటూ చెబుతారు. ఇపుడేమో పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా వైసిపి అడ్డుకుంటోందంటూ మండిపోతున్నారు.

నిజానికి రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అడ్డుపడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రతిపక్షం అడ్డుపడితే ఆగిపోయే అభివృద్ధి కూడా ఓ అభివృద్ధేనా అని జనాలకు సందేహం వస్తే అది వాళ్ళ తప్పు కాదు సుమా. పైగా ప్రజలు కష్టాల్లోనే ఉండాలని, అభివృద్ధికి అడ్డుపడటమే సైకో ధోరణులని కూడా చంద్రబాబు వర్ణించారు లేండి. ఇంతకీ జగన్ అడ్డు పడటం వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఎన్ని ఆగిపోయాయి ? ఎన్ని పరిశ్రమలు వెనక్కు వెళ్ళిపోయింది మాత్రం చెప్పలేదు.

పింఛన్ల సభలను వైసిపి అడ్డుకుంటున్నదట. పసుపు కుంకుమ కార్యక్రమాన్ని అడ్డుకోవటం జగన్ శాడిజంకు నిదర్శనంగా చంద్రబాబు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఇచ్చేది చంద్రబాబు, పుచ్చుకునేది జనాలైతే మధ్యలో జగన్ ఎందుకు అడ్డుపడాతరబ్బా ? పోయిన ఎన్నికల్లో డ్వాక్రా రుణాలకు ఇచ్చిన హామీనే సంపూర్ణంగా నెరవేర్చని చంద్రబాబు తాజాగా పసుపు కుంకుమ పేరుతో హామీ ఇవ్వటంపై డ్వాక్రా మహిళలు మండిపతున్నారెందుకు ? మరప్పుడు మండిపడుతున్న డ్వాక్రా మహిళలు కూడా శాడిస్టులేనా ? ఏంటో రోజు రోజుకు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధమవుతోందో లేదో ?