ఏ ప్రభుత్వం కూడా ఎవరికీ ఎప్పుడూ పోస్టు డేటెడ్ చెక్కులు ఇచ్చిన వైనం లేదు. మొన్న పసుపు కుంకుమ లబ్దిదారులకు పోస్టుడేటెడ్ చెక్కులిచ్చి నవ్వులపాలైన ప్రభుత్వం తాజాగా పోస్టుడేటెడ్ జీవోలను జారీ చేసి మరోసారి అభాసుపాలైంది. ప్రభుత్వ కాంట్రాక్టర్లకు మాత్రమే పోస్టుడేటెడ్ చెక్కులు ఇస్తుంటుంది ఫైనాన్స్ డిపార్ట్ మెంటు అప్పుడప్పుడు. అలాంటిది ఇపుడు చంద్రబాబు ఉద్యోగులకు, సంక్షేమ పథకాల్లో లబ్దిదారుల విషయంలో పోస్టుడేటెడ్ జపం చేస్తుండటం విచిత్రంగా ఉంది.
మొన్న పసుపు కుంకుమ పథకంలో డ్వాక్రా మహిళలకు పోస్టుడేటెడ్ చెక్కులిచ్చింది. చాలా చోట్ల మహిళలు ఆ చెక్కులను తీసుకుని బ్యాంకులకు వెళితే అవి చెల్లుబాటు కాలేదు. అక్కడే అర్ధమైపోయింది చంద్రబాబు మోసం. ఖజానాలో డబ్బు లేదు. ఎన్నికలేమో తరుముకొచ్చేస్తోంది. అందుకనే హఠాత్తుగా పోస్టుడేటెడ్ చెక్కులనే మోసాన్ని చంద్రబాబు బయటకు తీశారు. ఏ ప్రభుత్వమైనా ఖజానాలో డబ్బుంటేనే చెక్కులిస్తుంది. లేకపోతే డబ్బులొచ్చిన తర్వాతే చెక్కులు మంజూరు చేస్తుంది. ఇక్కడే అర్ధమైంది చంద్రబాబు మోసం.
కానీ విచిత్రంగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం డబ్బు లేకపోయినా పోస్టు డేటెడ్ చెక్కులిచ్చేసి మహిళల ఓట్లు కొల్లగొడదామని ప్లాన్ వేసింది. సరే చెక్కులంటే ఏదోలే మాయ చేశారని అనుకుందాం. తాజాగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన మధ్యంతర భృతికి కూడా పోస్టుడేటెడ్ జీవోలిచ్చారు. అంటే ఏప్రిల్-మే నెలలో జరిగే ఎన్నికల్లో గెలిచే ప్రభుత్వమే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలి. ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలుస్తుందో తెలీదు.
అలాంటిది ఉద్యోగుల మధ్యంత భృతిని జూన్ లో చెల్లించేట్లుగా చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇవ్వటమే విచిత్రంగా ఉంది. ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన చెల్లింపులు అప్పటికప్పుడు చేస్తే చేయాలి లేదా వాయిదా వేయాలి. అంతేకానీ ఎన్నికల తర్వాత తామే ఇస్తామంటూ జారీ చేసే జీవోలు చెల్లవు. ఇంతచిన్న విషయం చంద్రబాబు తెలీకకాదు జీవో ఇచ్చింది. కేవలం ఉద్యోగులను మోసం చేయటానికి ఈ జీవో ఇచ్చారని ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి మండిపడ్డారు.