వైసిపినే అధికారంలోకి వస్తుందని ఒప్పేసుకున్నారా ? అందుకే దగ్గుబాటి వైసిపిలోకి

తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపిలో చేరటంతో చంద్రబాబునాయుడుకు మైండ్ బ్లాంక్ అయినట్లుంది.  అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసిపిలో చేరిందంటూ చంద్రబాబు టెలికాన్ఫరెన్సులో మండిపడ్డారు. లోటస్ పాండ్ లోని నివాసంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కొడుకు హితేష్ చెంచురామ్ ఆదివారం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అంటే తండ్రి, కొడుకులు దాదాపు వైసిపిలో చేరిపోయినట్లే. కాకపోతే మంచి ముహూర్తం చూసుకుని పార్టీ కండువా కప్పుకోనున్నట్లు స్వయంగా వెంకటేశ్వరరావే చెప్పారు. ఎన్టీయార్ పెద్దల్లుడు, తన తోడల్లుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపిలో చేరటం చంద్రబాబుకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

సరే ఈరోజు కాకపోయినా ఏదో ఓ రోజు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా వైసిపిలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ విషయాలను పక్కనపెడితే సోమవారం చంద్రబాబు నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసిపిలో చేరిందన్నారు. చంద్రబాబు ఆరోపణలు విచిత్రంగానే ఉంది. ఎందుకంటే, దగ్గుబాటి కుటుంబం చేరింది ప్రతిపక్షమైన వైసిపిలో. అధికారం కోసమే అయితే దగ్గుబాటి కుటుంబం టిడిపిలోనే చేరేది కదా ? అంటే రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది వైసిపినే అని చంద్రబాబుకు అర్ధమైపోయిందా ?

దగ్గుబాటి మారని పార్టీలు లేవంటూ ఎద్దేవా చేశారు. నిజమే రాజకీయ నేతలు పార్టీలు మారటం సహజమే. చంద్రబాబు మాత్రం అధికారం కోసం ప్రతీ ఎన్నికకూ ఒక పార్టీతో పొత్తులు పెట్టుకోవటం లేదా ? అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసిపితో కుమ్మకైందని ఆరోపించటం కూడా విచిత్రంగానే ఉంది. ఎందుకంటే, లక్ష్మీపార్వతి వైసిపిలో ఈరోజు చేరలేదు. 2014 ఎన్నికల సమయంలోనే ఆమె వైసిపిలో ఉన్నారు. అవకాశవాదులంతా వైసిపిలో చేరుతున్నారని విమర్శించారు. వైసిపిలో చేరిన వాళ్ళంతా ఎన్టీయార్ కు అప్రతిష్ట తెస్తున్నారని చంద్రబాబు తెగ బాధపడిపోయారు.

నిజంగా కుటుంబసభ్యులతో కలసి ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే. అధికారంలోకి రాగానే ఎన్టీయార్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా పార్టీకి, ప్రజలకు ఎన్టీయార్ ను దూరం చేయటానికి ప్రయత్నంచేసింది చంద్రబాబే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇఫుడేమో ఎన్టీయార్ ఇమేజి గురించి చంద్రబాబు కొత్తగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. వైసిపిలో చేరిన దగ్గుబాటి మళ్ళీ ఎన్టీయార్ బయోపిక్ తీయాలని కుట్ర చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది.