హైదరాబాద్ ఉమ్మడి రాజధానని ఇపుడు గుర్తుకొచ్చిందా ?

చంద్రబాబునాయుడు అండ్ కో వాదన విచిత్రంగా ఉంది. హైదరాబాద్ 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని అంటూ ఇపుడు గొంతెత్తి అరుస్తున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణా, ఏపిలకు హైదరాబాద్ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ విషయాన్ని చంద్రబాబే మరచిపోయి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే హైదరాబావ్ వదిలి విజయవాడకు పారిపోయారు. మరి అప్పట్లో 10 ఏళ్ళ ఉమ్మడి రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి ఎందుకు విజయవాడకు పారిపోయారు ?

అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే కెసియార్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీవెన్ సన్ ఓటును కొనుగోలు చేయబోయి అడ్డంగా బుక్కైపోయారు. రూ 5 కోట్లకు కుదుర్చుకున్న బేరంలో రూ 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చేందుకు వెళ్ళిన అప్పటి టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి అడ్డంగా దిరికిపోయారు. దాంతో తనపైన కూడా కేసు నమోదవుతుందని, అరెస్టు తప్పదన్న భయంతోనే చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయారని అందరికీ తెలిసిందే.

మళ్ళీ ఇంతకాలానికి ఓట్ల తొలగింపు స్కాంలో ఇరుక్కున్నారు. విచిత్రమేమిటంటే, ఓటుకునోటు కేసైనా, ఓట్ల తొలగింపు స్కామైన హైదరాబాద్ కేంద్రంగానే చంద్రబాబు ఇరుక్కున్నారు. దాంతో కెసియార్  పై అడ్డదిడ్డంగా మాట్లాడుతూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానంటూ సంబంధం లేని బెదిరింపులకు దిగారు. హైదరాబాద్ ను వదిలేసి పొమ్మని చంద్రబాబుకు కెసియార్ ఏమైనా చెప్పారా ? తనంతట తానుగా కేసులో ఇరుక్కుని భయపడి విజయవాడకు పారిపోయిన విషయం కన్వీనియంట్ గా చంద్రబాబు పక్కనపెట్టేసి కెసియార్ పై రంకెలేస్తే ఏమిటి లాభం ?